తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని ప్రాంతంలోనే ఉండాలని, ఆయన వేరే చోటుకు వెళ్ళ వద్దని, ఆయన ఇక్కడ ఉంటేనే తమకు ఎంతో ధైర్యమని రాజధాని రైతులు అన్నారు. ఈ రోజు ప్రభుత్వం చంద్రబాబు పై చేస్తున్న కక్ష పూరిత విదానలకు వ్యతిరేకంగా, చంద్రబాబుకు మద్దతు తెలపటానికి, ఉండవల్లిలోని ఆయన ఇంటి దగ్గరకు, రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, చంద్రబాబు రాజధాని ప్రాంతంలోనే ఉండాలి కోరారు. కొత్త ప్రభుత్వం అమరావతి పై చేస్తున్న కక్ష పూరిత వైఖరితో, తమ భవిష్యత్తు గందరగోళంలో పడిందని, ఇక్కడ గత ప్రభుత్వం చేస్తున్న నిర్మాణాలన్నీ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తరుపున, కౌలు రైతులకు ఇచ్చే చెక్కులు కూడా జగన్ ప్రభుత్వం ఇవ్వటం లేదని బాధ పడ్డారు. అలాగే చంద్రబాబు పై జగన్ ప్రభుత్వం చేస్తున్న కక్ష పూరిత వైఖరిని తప్పు పట్టారు.
చంద్రబాబుని ఇక్కడ నుంచి గెంటేయాలని చూస్తున్నారని, చంద్రబాబు ఉండేందుకు తమ ఇళ్ళు ఇస్తామే తప్ప ఇక్కడ నుంచి వెళ్ళనివ్వమని రైతులు స్పష్టం చేశారు. అమరావతిలోనే చంద్రబాబు ఇల్లు కట్టుకోవటానికి స్థలాన్ని ఇచ్చేందుకు తాము రెడీగా ఉన్నామని రైతులు తెలిపారు. ప్రజావేదికను అలా కూల్చేస్తారా అని వారు తప్పుపట్టారు. చంద్రబాబు ఉంటున్న ఇల్లు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కట్టినవేనని అన్నారు. జగన్ కు నిజంగా దమ్ము ఉంటే, కరకట్టపై ఉన్న ఆస్పత్రి గోకరాజు గంగరాజుదని, ఆయన బీజేపీ నేత అని, ఆయనవి పడగొట్టాలని ఛాలెంజ్ చేసారు. ఆయన బీజేపీ నేత కాబట్టే,జగన్ ఆ ఆస్పత్రి జోలుకెళ్లలేదని రైతులు విమర్శించారు. ముందు అవి కూల్చకుండా ప్రజావేదికను ఎందుకు కూల్చారని అడిగారు. అమరావతిలో అవినీతి అవినీతి అంటూ, ఈ ప్రాంతాన్ని నష్ట పరుస్తున్నారని, అవినీతి జరిగితే చర్యలు తీసుకోండి, అమరావతి బ్రాండ్ ఇమేజ్ చెడగొట్ట వద్దు అని వేడుకున్నారు. చంద్రబాబు ఎక్కడకు వెళ్ళాల్సిన పని లేదని, ఇక్కడే ఉండాలని మనోధైర్యం చెప్పేందుకే మేమంతా ఇక్కడకు వచ్చామని రైతులు చెప్పారు.