గన్నవరం ఎయిర్ పోర్ట్ ని అధునాతనంగా నిర్మించుకుని, కేంద్రం చేత ఇంటర్నేషనల్ స్టేటస్ తెప్పించుకున్నారు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అయితే అప్పట్లో మారిన రాజకీయ పరిస్తితుల కారణంగా, ఒక్క ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా రాకుండా, అప్పటి కేంద్ర పెద్దలు అడ్డుకున్నారనే విమర్శలు ఉన్నాయి. అయితే చంద్రబాబు మాత్రం పట్టు వీడ లేదు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో, ఇండిగోని ఒప్పించి, గన్నవరం నుంచి సింగపూర్ దేశానికి ఫ్లైట్ కనెక్టివిటీ తేగలిగారు. ఇదే గన్నవరం నుంచి మొదటి ఇంటర్నేషనల్ ఫ్లైట్. తరువాత దుబాయ్ ఫ్లైట్ సర్వీస్ కు కూడా ఒప్పించే ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే, తరువాత ప్రభుత్వం మారటంతో, ఇది మరుగున పడిపోయింది. అయితే, ఇప్పుడు సింగపూర్ సర్వీస్ కూడా ఎసరు వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన విధంగా స్పందిచకపోవటంతో, ఈ సర్వీస్ నడపలేము అంటూ ఇండిగో చేతులు ఎత్తేసింది.
చంద్రబాబు తీసుకు వచ్చిన వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ విధానంలో కాంట్రాక్టును మళ్ళీ కొనసాగించలేమని ప్రభుత్వం చెప్పటంతో, ఇండిగో సంస్థ సింగపూర్ ఫ్లైట్ ఆపేసింది. దీంతో, జూలై 9వ తేదీ నుంచి, గన్నవరం - సింగపూర్ ఫ్లైట్ బుకింగ్ ఆగిపోనుండి. ఏం జరిగిందో తెలియదు కాని, మొన్నటి వరకు కొత్త ప్రభుత్వం కూడా ఈ కాంట్రాక్టు కొనసాగిస్తుంది అని అందరూ అనుకున్నారు. ఉన్నట్టు ఉంది, ఏపీ ఏడీసీఎల్ సంస్థ నుంచి ఇండిగో హెడ్డాఫీసుకు, మేము కాంట్రాక్టును పొడిగించటానికి సానుకూలంగా లేము అంటూ, ఈమెయిల్ వెళ్ళింది. అయితే ఎందుకు రద్దు చేసుకున్నారు అనే విషయం మాత్రం, ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. సింగపూర్ - గన్నవరం సర్వీస్ ఎప్పుడూ, 80శాతం పైగా ఆక్యుపెన్సీతో రాక పోకలు సాగించేది. మొన్న సమ్మర్ లో, వంద శాతం ఆక్యుపెన్సీతో సింగపూర్ సర్వీసు నడిచింది. ఇప్పుడు ఈ సర్వీస్ రద్దు కావటంతో, ఇక మనకు విదేశీ సర్వీస్ ఆశలు ఇప్పట్లో లేనట్టే..