పట్టిసీమ అంటే అది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన జగన్, ఇప్పుడు అధికారం రావటంతో ఎలా వ్యవహరిస్తారా అని అందరూ ఎదురు చూసారు. ప్రజా వేదికని కూల్చినట్టు, పట్టిసీమను కూడా కూల్చేస్తారా అనే సందేహాలు వచ్చాయి. అయితే నాలుగు రోజుల క్రితం, సైలెంట్ గా పట్టిసీమ పంపులు ఆన్ చేసి, నీళ్ళు వదిలారు. అంటే పట్టిసీమ వేస్ట్ కాదు, కృష్ణా డెల్టాను కాపాడే వరప్రదాయని అని జగన్ ఒప్పుకున్నట్టే కదా.. అయితే అంతా సవ్యంగా ఉంది, మరి కొద్ది రోజుల్లో పట్టిసీమ ద్వారా నీళ్ళు వస్తాయి అని రైతులు అనుకుంటున్న టైంలో, మరో పిడుగు లాంటి వార్త వారిని కలిచి వేస్తుంది. పట్టిసీమ ప్రాజెక్ట్ ఆపెయ్యాలని చాలా మంది కోరుతున్నారు. అందులో ఏకంగా డిప్యూటీ సియం కూడా ఉండటం, ఇప్పుడు కృష్ణా డెల్టా రైతులను కలిచివేస్తున్న అంశం. స్థానికంగా రైతుల అవసరాలే ప్రస్తుతం తీరటం లేదని, ఇలాంటి పరిస్థితిలో పట్టిసీమ నుంచి నీటిని కృష్ణా డెల్టాకు తరలించటం, ఏ మాత్రం కరెక్ట్ కాదని, వెంటనే పట్టిసీమను నిలిపివేయాలని కోరుతూ, జగన్ దృష్టికి, ఈ అంశం తీసుకెళతానని డిప్యూటీ సియం పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు.
శనివారం కల్లెక్టరేట్ లో జరిగిన, పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి హోదాలో, ఈ సమావేశానికి హాజరైన పిల్లి సుభాష్‌చంద్రబోస్, సమావేశం తరువాత డియాతో మాట్లాడారు. పట్టిసీమ నుంచి నీటిని తరలించడం పై ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అంతా అసంతృప్తి వ్యక్తం చేసారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతుల అవసరాలకే, ఇక్కడ నీరు సరిపోవటం లేదని, ఇలాంటి సమయంలో ఎలా నీళ్ళను తరలిస్తారని మంత్రి ప్రశ్నించారు. అందుకే పట్టిసీమను ఆపెయ్యాలని, జగన్ కు ఉత్తరం రాస్తానని డిప్యూటీ సియం పిల్లి సుభాష్‌చంద్రబోస్ అన్నారు. ఇక రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధి ఎంవీ సూర్యనారాయణరాజు అయితే ఒక అడుగు ముందుకు వేసి, పట్టిసీమ ఎత్తిపోతల పథకం అక్రమ కట్టడమని, దాన్ని కూడా కూల్చేయాలని ముఖ్యమంత్రిని కోరతామని అన్నారు. అయితే పట్టిసీమ పంపులు ఆన్ అయ్యేది, గోదావరికి వరద వచ్చినప్పుడు మాత్రమే, అంటే గోదావరి నీరు సముద్రంలో కలిసే సమయంలో మాత్రమే, పట్టిసీమని ఆన్ చేస్తారు. మరి ఎందుకు పట్టిసీమను ఆపమంటున్నారో, కూల్చమంటున్నారో, వారికే తెలియాలి.