ఆంధ్రప్రదేశ్‌ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో)గా 1992 బ్యాచ్‌ ఐఏఎస్‌ కె.విజయానంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ప్రస్తుత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిని బదిలీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి విజయానంద్‌ నియామకం చేపడుతున్నట్లు ఈసీఐ పేర్కొంది. ఇప్పటివరకూ ఆయన చూస్తున్న శాఖల బాధ్యతలన్నింటినీ తక్షణమే ఇతర అధికారులకు అప్పగించాలని పేర్కొంది. సచివాలయంలోని ఎన్నికల విభాగానికి కార్యదర్శిగా మినహా, విజయానంద్‌కు ఎలాంటి అదనపు బాధ్యతలు అప్పగించరాదని సూచించింది. ఈసీఐ నోటిఫికేషన్‌ను ప్రస్తావిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీ క్యాడర్‌కు చెందిన విజయానంద్ 1992లో అదిలాబాద్ జిల్లా ఉట్నూరు సబ్ కలెక్టర్‌గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అయితే ప్రస్తుత సీఈఓ ద్వివేదికి తదుపరి పోస్టింగ్‌ ఎక్కడిస్తున్నారు..? ఏ హోదా కల్పిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. కాగా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ప్రధానాధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని ఈ ఏడాది జనవరిలో ఎన్నికల కమిషన్‌ నియమించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read