గన్నవరం ఎయిర్‌పోర్టులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనిఖీలు నిర్వహించారు. అంతేకాదు.. చంద్రబాబు వాహనాన్ని ఎయిర్‌పోర్టులోకి భద్రతా సిబ్బంది అనుమతించలేదు. సామాన్య ప్రయాణికుడి తరహాలో చంద్రబాబును తనిఖీ చేయడం గమనార్హం. ఎయిర్‌పోర్టు లాంజ్ నుంచి విమానం వరకు ప్రయాణికుల బస్సులోనే బాబు వెళ్లారు. అయితే.. వీఐపీ, జెడ్ ప్లస్ భద్రత ఉన్నా చంద్రబాబుకు అధికారులు ప్రత్యేక వాహనం కేటాయించలేదు. రాష్ట్రంలోనూ చంద్రబాబు కాన్వాయ్‌కి పైలెట్ క్లియరెన్స్ తొలగించారు. ట్రాఫిక్‌లో చంద్రబాబు వాహనం ఆగితే భద్రత పరంగా శ్రేయస్కరం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.. అటు పౌరవిమానయాన శాఖ అధికారులు కానీ ఇంతవరకూ స్పందించలేదు.
చంద్రబాబు కు జరుగుతున్న అవమానం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 14ఏళ్లు సీఎం గా చేసిన వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వకపోవటం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమని అడిగితే పై నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదంటున్న అధికారులు. అయితే దేశంలో అతి కొద్ది మందికి మాత్రమే ఉండే జెడ్ + భద్రతలో చంద్రబాబు ఉన్నారు. జెడ్ + భద్రత ఉన్న వారికి తనిఖీలు అవసరం లేదని, నిభందనల్లో స్పష్టంగా ఉంది. అయినా చంద్రబాబుని అడుగడుగునా అవమానిస్తున్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం, చంద్రబాబు ఇవన్నీ మౌనంగా భరిస్తున్నారు. రేపు చంద్రబాబుకి జరగరాంది ఏమన్నా జరిగితే ఎవరు బాధ్యులో అక్కడ మోడీ, అమిత్ షా, ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి గారే చెప్పాలి.