ఆంధ్రప్రదేశ్ సహా, ఆరు రాష్ట్రాలకు కేంద్రప్రభుత్వం కరువు హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ, తమిళనాడు, తెలంగాణకు హెచ్చరికలు జారీ చేసింది. ఆరు రాష్ట్రాల్లో నీటికొరత తీవ్రంగా ఉందని తెలిపింది. అందుబాటులో ఉన్న కొద్ది జలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. వర్షాలు ఆలస్యం కావడం, రుతుపవనాలు ఆశించిన ప్రభావం చూపకపోతే పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని సూచించింది. గత పదేళ్ల సగటుతో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితులు మరింత గడ్డుగా ఉన్నాయని పేర్కొంది. దశాబ్దకాలంలో రిజర్వాయర్లలో ఉన్న సగటు నీటి నిల్వలతో పోలిస్తే, ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు 20 శాతం కంటే తక్కువగా ఉన్న సందర్భంలో కరువు హెచ్చరికలు జారీ చేస్తారు. రిజర్వాయర్లు తిరిగి నీటితో నిండే వరకూ.. ఇప్పుడున్న నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచించింది.
దేశవ్యాప్తంగా సీడబ్లూసీ పర్యవేక్షణలో 91 రిజర్వాయర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రిజర్వాయర్లలో 3,599 వేల కోట్ల క్యూబిక్ మీటర్ల నీటి నిల్వలున్నాయి. మొత్తం రిజర్వాయర్ల నీటి సామర్థ్యంలో ఇది 22శాతం. గుజరాత్, మహారాష్ర్టల్లోని 27 రిజర్వాయర్లలో 13శాతం, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని 31 రిజర్వాయర్లలో 13శాతం నీటి నిల్వలు ఉన్నాయని చెప్పింది. పశ్చిమ, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరాదిలోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాల్లోని రిజర్వాయరల్లో నీటి నిల్వలు మెరుగ్గా ఉన్నాయి.