వైఎస్ జగన్ తో వైసీపీ ఎమ్మెల్యే రోజా భేటీ కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న రోజాను వైఎస్ జగన్ అమరావతికి పిలిపించారని.. రోజా హుటాహుటిన నగరి నుంచి విజయవాడ పయనమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రోజా స్పందించారు. కొద్దిసేపటి క్రితం విజయవాడకు రోజా చేరుకుని మీడియాతో మాట్లాడారు. తనను ఎవరూ అమరావతికి రమ్మనమని చెప్పలేదని.. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల కోసం తానే ఇక్కడికి వచ్చానని చెప్పారు. మంత్రి పదవి దక్కలేదన్న బాధ తనకు లేదని అన్నారు. కులాల సమీకరణ కారణంగానే తనకు పదవి దక్కలేదని అన్నారు. కేబినెట్‌లో చోటు దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటూ వస్తున్నారు.
అంతేకాదు జూన్ 8న అమరావతిలో జరిగిన కొత్త మంత్రుల స్వీకారోత్సవానికి కూడా రోజా హాజరుకాలేదు. ఎమ్మెల్యే రోజాకు నామినెటేడ్ పోస్ట్, ఆర్టీసీ చైర్మన్, మహిళా కమీషన్ చైర్మన్ ఇచ్చే యోచనలో సీఎం జగన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.. వాటిపై కూడా ఆమె మాట్లాడారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని తనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. అలాగే మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అందరు ఎమ్మెల్యేల హాజరు అవసరం లేదని, అందుకే రాలేదని ఆమె స్పష్టం చేశారు. మంత్రి పదవులు దక్కించుకున్నవారికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.