ఎట్టకేలకు నగరి ఎమ్మెల్యే రోజాకి పదవి దక్కింది. కేబినెట్ లో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న రోజాకి సీఎం జగన్ పదవి ఇచ్చారు. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా ఎమ్మెల్యే రోజాని అపాయింట్ చేశారు. తనకు మంత్రిపదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే రోజా మంగళవారం(జూన్ 11,2019) సీఎం జగన్ ని కలిశారు. మంత్రి పదవి రాకపోవడంపై చర్చించారు. సీఎంతో మాట్లాడిన తర్వాత.. ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా రోజాని నియమించినట్టు వార్త వచ్చింది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకి.. కేబినెట్ లో మంత్రి పదవితోపాటు కీలకమైన శాఖ వస్తుందని భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆమె అభిమానులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారు. అంచనాలకు విరుద్ధంగా చోటు దక్కలేదు. దీంతో మంత్రుల ప్రమాణస్వీకారానికి డుమ్మా కొట్టారు. హైదరాబాద్ లోనే ఉండిపోయారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయటానికి విజయవాడ వచ్చిన రోజా.. సీఎం జగన్ పిలుపుతో భేటీ అయ్యారు.
రెండో విడతలో మంత్రి పదవి ఖాయంగా జగన్ నుంచి రోజాకి హామీ వచ్చినట్లు తెలిసింది. ఇదే క్రమంలో నామినేటెడ్ పదవి తీసుకోవటానికి విముఖత వ్యక్తం చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే అనూహ్యంగా ఆమెకు కీలకమైన ఏపీఐఐసీ పదవి దక్కింది. APIIC (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) పదవి ఏపీకి పరిశ్రమలు తీసుకురావటంలో.. మౌలిక వసతులు కల్పించటంలో ఈ కార్పొరేషన్ దే ప్రధాన పాత్ర. లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. కేబినెట్ హోదాతో సమానంగా ఉంటుంది ఈ చైర్ పర్సన్ పోస్టు ఛైర్ పర్సన్‌గా రోజాను నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియడం లేదని రోజా ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాను ఎవరిమీద అలగలేదని, ఏ పదవిని ఇచ్చినా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే.. మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్న ఆమెను తాజాగా జగన్ ఈ పదవిలో నియమించడం విశేషం.