టీడీపీకి చెందిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి, తెలుగుదేశం పార్టీని వీడి, బీజేపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరిన తరువాత, వరదాపురం సూరి మొట్టమొదటి సారిగా, ధర్మవరం పట్టణంలో తన క్యాడర్ తో సమావేశం నిర్వహించారు. ధర్మవరం నియోజకవర్గంలో వైసీపీ చేస్తున్న అరాచకం తట్టుకోలేక , కార్యకర్తలను కాపాడటం కోసం, బీజేపీలో చేరాల్సి వచ్చిందని, సూరి అన్నారు. ఈ సమావేశానికి నియోజకవర్గం నలు మూలాల నుంచి, ఆయన అబిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా సూరి మాట్లాడుతూ, గత ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి, వైసీపీ నేతలు అరాచకం చేస్తున్నారని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి, గొడవలు చేస్తూ, ఏకంగా ఒక కార్యకర్తను నిర్ధాక్షిణ్యంగా చంపడం బాధ కలిగించందని సూరి అన్నారు.
ఇలాంటి సమయంలో, ఈ అరాచకాలను అడ్డుకుని, నియోజకవర్గంలో తనను నమ్ముకున్న కార్యకర్తలకు అండగా నిలవాలనుకుని, దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా చూసి, తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరినట్టు చెప్పారు. తెలుగుదేశం పార్టీని వీడుతున్నానన్న అనే మాట చెబుతున్నప్పుడు సూరి తీవ్ర భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి సూరి, తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. మాజీ మంత్రి దివంగత పరిటాల రవీంద్రకు సన్నిహితుడిగా ఉన్నారు. 2009లో ధర్మవరం నుంచి టీడీపీ టిక్కెట్టు రాకపోవటంతో, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. తరువాత 2014లో ధర్మవరం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రత్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పై ఓడిపోయారు.