ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా, తెలంగాణా మన రాష్ట్రం పై పన్నిన నీటి కుట్ర గురించి అసెంబ్లీలో చర్చ జరిగింది. అయితే జగన్ మోహన్ రెడ్డి మాత్రం, తాము మంచి చేస్తున్నామని, కేసీఆర్ ఎంతో దయా హృదయంతో, వారి రాష్ట్రంలో పారే నీళ్ళు, మనకి ఇస్తాను అంటున్నారని, దానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అని చంద్రబాబుని ప్రశ్నించారు. కేసీఆర్ మంచి పని చేస్తున్నారు, మేము సహకరిస్తున్నాం అని జగన్ అన్నారు. అయితే జగన్ వ్యాఖ్యల పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఇది మీ ఇద్దరి మధ్యా విషయం కాదు, రాష్ట్ర సమస్య, ఇంత ఈజీగా తీసుకోకండి, హెచ్చరిస్తున్నా, రాష్ట్రం నాశనం అయిపోతుంది. తొందర పడకండి, అలోచించి నిర్ణయం తీసుకోండి అని జగన్ ని కోరారు. ఈ సందర్భంలో చంద్రబాబు అంత ఆవేదనగా మాట్లాడుతుంటే, ఒక పక్క నుంచి జగన్ వెకిలి నవ్వులు నవ్వుతూ ఉండటంతో, చంద్రబాబు మరింత స్వరం పెంచారు.
మీ వయసు, నా రాజకీయ అనుభవం అంత లేదు. ఇంత సీరియస్ సబ్జెక్ట్ పై మీకు నవ్వుగా ఉంది. భవిష్యత్తు తరాలు నాశనం అవుతాయి. ఇది వరకు మీరే అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు వస్తే ఏపీ, తెలంగాణ, భారత్-పాక్ మాదిరిగా మారుతాయ. ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని వెనకేసుకొస్తున్నారు. కలిసి ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటుంది. భావితరాల భవిష్యత్తు తాకట్టు పెట్టే అధికారం ఎవరికీ లేదని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంలో వైసీపీ సభ్యులు పెద్దగా అరవటంతో, సభలో తన నోరు మూయించవచ్చని కాని, ప్రజలు నిజాలు గ్రహిస్తారని తెలిపారు. తొందరపాటు నిర్ణయాలు రాష్ట్రానికి మంచిది కాదని జగన్ కు సూచించారు. నీళ్ళ సమస్య, సున్నితమైన అంశం, దాని పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు, నేను సబ్జెక్ట్ మాట్లాడుతుంటే, చౌకబారు విమర్శలు చేస్తున్నారు చేసినా (గాడిద అని సంభోదించటం పై) రాష్ట్ర ప్రయోజనాల కోసం భరిస్తా అని చంద్రబాబు అన్నారు. ఇతరుల దయాదాక్షిణ్యాల పై ఆధారపడే పరిస్థితి రాష్ట్రానికి తేవద్దని జగన్ కు సూచించారు. తెలంగాణ భూభాగంలో ప్రాజెక్టులు మనం కడితే, రేపు ఆ నీళ్లు మావే అని తెలంగాణ అంటే మనం చేసేది ఏమి ఉండదని జగన్ కు చెప్పారు. గోదావరి నీళ్లు శ్రీశైలంకు తీసుకెళ్లడం పై చర్చ జరగాలని చంద్రబాబు అన్నారు.