జగన్ మోహన్ రెడ్డితో తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ అయ్యారు. నిన్న పట్టిసీమ నీటిని వాడుకునే మోటార్లకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరుతూ జగన్ కు లేఖ రాసిన వంశీ, ఈ రోజు జగన్ ను వచ్చి మరీ పర్సనల్ గా కలిసారు. పట్టిసీమ నుంచి నీరు వదలటంతో, పోలవరం కుడి కాలువ నుంచి నీటి మళ్లింపునకు 500 మోటార్లు పెట్టుకున్నామని, వాటికి ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని జగన్ ను వంశీ కోరారు. ఇప్పటికే ఈ విష్యం పై జగన్ కు లేఖ రాసిన వంశీ, తాజాగా ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని గన్నవరం నియోజకవర్గంలోని మెట్ట గ్రామాలకు తరలించేందుకు సహకరించాలని జగన్ కు విజ్ఞప్తి చేశారు. గత నాలుగేళ్లుగా తన సొంత ఖర్చుతో, రైతుల కోసం 500 మోటార్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకున్నామని, అప్పట్లో చంద్రబాబు గారు, దీనికి అవసరమయ్యే విద్యుత్తును ప్రభుత్వం తరుపున ఉచితంగా ఇచ్చారని చెప్పారు.
గతంలో ఇచ్చినట్టే, ఈ సంవత్సరం కూడా ఉచిత విద్యుత్తు సరఫరా ఇచ్చేలా ఏపీఎస్పీడీసీఎల్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని వంశీ కోరారు. మరి వంశీ విజ్ఞప్తికి జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఈ విషయం పై, విద్యుత్, ఇరిగేషన్ శాఖలకు సంబంధించిన మంత్రులకు కూడా లేఖల్ని పంపానని వంశీ చెప్పారు. పోలవరం కుడి కాల్వ కోసం, అక్కడి రైతులు తమ భూమిని త్యాగం చేసారని, పట్టిసీమ కోసం ఆ భూములు తామే తీసుకుని, పోలవరం కుడి కాలువ పూర్తి చేసామని, ఈ రోజు కృష్ణా డెల్టాకు నీరు వస్తుంది అంటే, ఆ రైతుల త్యాగమే అని, అందుకే వారిని ఆదుకోవాలని వంశీ కోరారు. అయితే, తెలుగుదేశం ఎమ్మెల్యే ఇలా జగన్ ను కలవటం పై రకరకాల వార్తలు వస్తున్నా, వంశీ మాత్రం, తన నియోజకవర్గ రైతుల కోసమే కలిసానని, ఎవరు ఏమి ప్రచారం చేసినా నష్టం లేదని అన్నారు.