జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతుంది. ఈ 60 రోజుల్లో జగన్ మార్క్ పరిపాలన కనిపించిందా అంటే, సామాన్యులకు మాత్రం, ఏది కొత్తగా లేదు. ఇంకా కొత్త కొత్త సమస్యలు ఎక్కువ అయ్యాయి. చంద్రబాబు పై కక్ష తీర్చుకోవటం లోనే, టైం గడిసి పోతుంది. దీనికి తోడు, విద్యుత్ ఒప్పందాల సమీక్షతో, విద్యుత్ పెట్టుబడిదారులు దూరం అయ్యారు. మరో పక్క పరిశ్రమల్లో 75 శాతం రిజర్వేషన్ అంటూ జగన్ తీసుకొచ్చిన కొత్త పాలసీతో, కొత్తగా కంపెనీలు వచ్చే అవకాసం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇసుక కొరతతో, మొత్తం తారు మారు అయ్యింది. ఎవరికీ పనులు లేవు. ఇసుక లేకపోవటంతో, అన్ని రంగాల పై ఈ ప్రభావం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ కుప్పకూపోయింది. జగన్ చెప్పిన సంక్షేమ కార్యక్రమాల్లో కూడా యుటర్న్ లు కనిపిస్తున్నాయి.
మరో పక్క కేంద్రం వైపు చూడాలి అంటేనే జగన్ ఆలోచిస్తున్నారు. కేంద్రం ఏమి ఇవ్వం అని చెప్తున్నా, కనీసం స్పందన లేదు. కేసిఆర్ తో స్నేహం మాత్రం, ఏపికి ఇబ్బందిగా మారింది. మొత్తానికి చంద్రబాబుని అసెంబ్లీలో హేళన చెయ్యటం తప్ప, ఇప్పటి వరకు, జగన్ మోహన్ రెడ్డి మార్క్ అయితే , ఈ రెండు నెలల్లో ఏమి కనిపించ లేదు. అయితే, జగన్ మోహన్ రెడ్డి పరిపాలన పై, మాజీ సియం, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విశాఖపట్నంలో జరిగిన ఒక కార్యక్రమంలో రోశయ్య పాల్గున్నారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో పలు విషయాల పై ఆయన స్పందించారు. ఇదే సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పరిపాలన ఎలా ఉంది అని విలేఖరులు ప్రశ్నించగా, రోశయ్య తనదైన శైలిలో స్పందించారు.
జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలు ఏంటో అర్ధం కావటం లేదని రోశయ్య అన్నారు. కేంద్రంతో తీరు సరిగ్గా లేదని రోశయ్య అన్నారు. అలాగే విపక్షాలను కలుపుకుని వెళ్ళటం లేదని అన్నారు. జగన్ ఆలోచనలు, ఆయన విధానం ఏంటో ఇప్పటికి అయితే అర్ధం కావటం లేదని, కొన్ని రోజులు ఆగితే కాని స్పష్టత రాదని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఖర్చులు బాగా తగ్గించుకోవాలి, చాలా పొదుపుగా ప్రభుత్వాన్ని నడపాలి, అప్పుడే కొన్నాళ్ళు అయినా నడుస్తుంది, అలా కాకుండా ఖర్చులు పెట్టుకుంటూ పొతే, ఆయనకు, రాష్ట్రానికి ఇబ్బందులేనని రోశయ్య అన్నారు. ఒక పక్క వైసీపీ నేతలు, ఈ ప్రపంచంలోనే మా జగన్ అంత నాయకుడు లేడు అని చెప్తుంటే, వైఎస్ఆర్ అత్యంత ఆప్తుడు అయిన రోశయ్య మాత్రం, జగన్ వైఖరి ఏంటో అర్ధం కావటం లేదు అంటూ, ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.