తన సహజ శైలికి భిన్నంగా, ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఓర్పుకి కూడా ఒక హద్దు ఉంటుంది అనేది అందుకేనేమో. గత పది రోజుల నుంచి అసెంబ్లీలో చంద్రబాబుని ఎంత అవమానిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. అయినా చంద్రబాబు ఎక్కడా బ్యాలెన్స్ తప్పకుండా, అలాగే ఉన్నారు. మాట్లాడే అవకాసం ఇవ్వకపోయినా, నిరసన తెలిపే అవకాసం ఇవ్వకపోయినా, కాంగా బయటకు వచ్చి, సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి, తాను చెప్పాలి అనుకున్నది ప్రజలకు చెప్పి వెళ్ళిపోతున్నారు. అయితే ఏ మనిషికి అయినా సహనం ఎంత కాలం ఉంటుంది, ఓర్పు నసించకుండా ఉండదు కదా ?ఆయన కూడా ఒక మనిషే కాదా, ఈ రోజు సభలో చంద్రబాబు పై జరిగిన అవమానాలకు, తన సహజ శైలికి భిన్నంగా చంద్రబాబు రియాక్ట్ అయ్యారు.
తెలంగాణాకు గోదావరి జలాలు తరలింపు పై, చంద్రబాబు ఎక్కడా ప్రభుత్వం పై ఒక్క విమర్శ కూడా చెయ్యకుండా, సూచనలు ఇచ్చారు. తెలంగాణా భూభాగం నుంచి మన నీళ్ళు వెళ్తే, శ్రీశైలం వచ్చే సరికి ఎంత నీరు వస్తుందో తెలుసా, ఇవన్నీ ఆలోచించండి, మేధావులతో చర్చించండి అంటూ ఒక్క విమర్శ కూడా చెయ్యకుండా, ఇది భావితరాలకు సంబందించిన విషయం, నీటి విషయం చాలా సున్నితమైనది, ఎక్కడా చిన్న తప్పు చెయ్యద్దు అంటూ జగన్ కు సలహా ఇచ్చారు. అయితే, జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు. అలాగే మంత్రులు కూడా అలాగే హేళన చేస్తూ స్పందించారు. నీ 40 ఏళ్ళ అనుభవం దేనికి, మేము కేసిఆర్ తో కలిసి చేసి చూపిస్తాం చూడు అంటూ, చంద్రబాబు పై విరుచుకు పడ్డారు. అయితే ఈ సందర్భంలో చంద్రబాబు మైక్ ఇవ్వమని ఎంత కోరినా స్పీకర్ మైక్ ఇవ్వలేదు.
దీంతో చంద్రబాబు వాక్ అవుట్ చేసి బయటకు వచ్చారు. సాయంత్రం మీడియాతో మాట్లాడారు. శాసనసభలో జగన్, అతని మంత్రుల ప్రవర్తన తీవ్ర అభ్యంతరంగా ఉందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఒళ్లు దగ్గరపెట్టుకో. భాషను కంట్రోల్ చేసుకో. మీ మంత్రులకు కూడా చెప్పండి. ఇష్టం వచ్చింట్టు నోరు పారేసుకుంటే మీ సియం హోదాకు హుందాతనం రాదు. నేను కూడా ఒక్క నిమిషంలో తిరిగి మీరు మాట్లాడినట్టే మాటలు అనగలను, నేను ఆ మాటలు అంటే జగన్ తల ఎక్కడ పెట్టుకుంటాడు? నోరు అదుపులో పెట్టుకో అని జగన్‌కి వార్నింగ్ ఇస్తున్నా అంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కోసం ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెడతారా? అని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.