ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల్లో నిన్న చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే, రెండు నిమషాలకే సభ వాయిదా పడింది. దానికి కారణం, మంత్రులు లేకపోవటం. అసలు విషయం తెలుసుకుని స్పీకర్ కూడా అవాక్కయ్యే పరిస్థితి వచ్చింది. చివరకు మంత్రులు వచ్చి క్షమాపణ చెప్పటంతో, వివాదం ముగిసింది. యధావిధిగా 9 గంటలకు స్పీకర్ సభలోకి వచ్చారు. రాగానే ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ మంత్రుల వైపు చూసారు. అయితే అక్కడ మంత్రులు ఎవరూ లేకపోవటంతో, స్పీకర్ కూడా ఒక్క నిమిషం షాక్ అయ్యారు. అయితే మంత్రులు ఎవరూ లేరని అప్పుడు స్పీకర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో సభను 15 నిమిషాలు పాటు స్పీకర్ సభను వాయిదా వేసారు.
మంత్రులు అందరూ క్యాబినెట్ సమావేశంలో ఉన్నారని, వారు అందుబాటులో లేరని, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి స్పీకర్ ద్రుష్టికి తెచ్చే దాకా, స్పీకర్ కూడా ఈ విషయం తెలియదు. అసెంబ్లీ సిబ్బంది కూడా, ముందుగా ఈ విషయం పై , స్పీకర్ కు సమాచారం ఇవ్వలేదు. సభ వాయిదా అనంతరం, మంత్రులు అసెంబ్లీకి వచ్చారు. క్యాబినెట్ సమావేశం జరుగుతూ ఉండటం, అది లేట్ అవ్వటం వల్ల, సభకు టైంకు రాలేకపోయమని, దీనికి చింతిస్తున్నామని, సభ్యులు అందరూ తమను క్షమించాలని, మంత్రి బుగ్గన రాజేంద్ర అన్నారు. ఈ పరిణామాల పై తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేసారు. దీని పై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా మంత్రులు లేక, సభ వాయిదా పడటం ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.
ఇలాంటి సంఘటనలు మంచిది కాదని, మరోసారి ఇలా జరగకుండా చూసే బాధ్యత స్పీకర్ గా మీ పైనే ఉందని చంద్రబాబు అన్నారు. శాసనసభ కంటే, క్యాబినెట్ సమావేశానికి ఈ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, ఇప్పుడే చూస్తున్నా అని చంద్రబాబు అన్నారు. ఇప్పటికే మంత్రి క్షమాపణ చెప్పారని, ఇంకా ఈ విషయం వదిలెయ్యాలని స్పీకర్ అన్నారు. మరో పక్క తాను క్యాబినెట్ సమావేశంలో ఉండగా, నా పై తెలుగుదేశం పార్టీ సభ్యులు అసత్యాలు ప్రచారం చేసారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. నేను వైసిపీలో అసంతృప్తిగా ఉన్నానని, పార్టీ మారుతున్నా అంటూ ప్రచారం చేసారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నా అని, జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో చాలా హ్యాపీగా ఉన్నానని అవంతి శ్రీనివాస్ అన్నారు.