టీడీపీ నుంచి భారీగా వస్తున్న వలసలతో ఏపీలో బీజేపీ బలపడే పరిస్థితులున్నాయా...? ఒకప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కాదు 15 ఏళ్లు ఉండాల్సిందేనని చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు అది ముగిసిన అధ్యయం అని చెప్పడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకొంటారా...? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పే బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో బలపడే అవకాశాలున్నాయా...? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా నినాదం కూడా ప్రచార అంశాల్లో ప్రధానమైనదిగా చెప్పవచ్చు. తమకు మెజార్టీ ఎంపీలు ఇస్తే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తెస్తాం అని ఎన్నికల ప్రచార సమయంలో, అంతకు ముందు వైసీపీ, టీడీపీ రెండు ప్రకటించాయి. కానీ తొలినుంచి హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పిన బీజేపీ రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అది ముగిసిన అధ్యయం అని కూడా వెల్లడించింది. దీంతో ఏపీలో ప్రత్యేక ప్రత్యేక హోదా సంజీవంగా ఉంటుందా...? ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు కేంద్రంపై గళం విప్పుతాయా...? ఒకవేళ ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కేంద్రంపై ఒత్తిడి పెంచితే అప్పుడు బీజేపీ పరిస్థితి ఏమిటీ అన్నది ప్రధానంగా చర్చ సాగుతోంది.
ప్రత్యేక హోదా కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందా...? వలస వచ్చిన నేతలతోనే ఏపీలో బీజేపీ పుంజుకొంటుందా అంటే ఆ పరిస్థితి ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా అన్నది కొంత సెంటిమెంటుగా మారింది. ఆ తరువాత ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అదొక్కటే ప్రధాన అంశం కాకపోయినా ప్రచారంలో మాత్రం అది కీలకంగా మారింది. ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేక హోదా అంశాన్ని పక్కనెట్టి రాష్ట్రంలో నెగ్గుకురాగలదా...? అన్నది ప్రస్తుతం చర్చాంశనీయంగా మారింది. హోదాయే బీజేపీకి శాపంగా మారనున్నదా...? : బీజేపీతో తెగతెంపులు చేసుకొన్న టీడీపీ నాయకత్వం ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పోరాటాలు చేయాలని భావిస్తోంది. పైగా ఏపీలోని టీడీపీ నేతలు మెజార్టీగా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీయే టార్గెట్ గా టీడీపీ నాయకత్వం పోరాటాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు పలుమార్లు పేర్కొంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకొన్న జనసేన పార్టీ సైతం ఈ ఐదేళ్ల కాలంలో పార్టీకి సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలని యోచిస్తోంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, రాష్ట్ర సమస్యలు, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని తన పోరాట అజెండాలో చేర్చుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో పోరాడి తీరుతామని వైసీపీ ఎంపీలు కూడా స్పష్టంచేశారు. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు 15 ఏళ్లు ఉండాలని నాడు బీజేపీ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీలోకి ఎంతమంది పార్టీ నేతలు వలస వచ్చినా వారికి ఏపీకి ప్రత్యేక హోదా అంశం ప్రధాన సమస్యగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలోనూ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి సరిగా లేని సమయంలో పలువురు ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరారు. కానీ తరువాత కాలంలో వారు ఆ పార్టీని వీడి వైసీపీ, టీడీపీల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం బీజేపీలోకి గతంలో కంటే భారీగా వలసలు సాగినా ఆ బలంతో ఏపీలో బీజేపీ పుంజుకొనే పరిస్థితి ఉందా అన్నది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. విశాఖ రైల్వేజోన్ ప్రకటనను బీజేపీ చేసినా దాని వల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరలేదన్న విమర్శలు నాడు రాజకీయ పక్షాల నుంచి వచ్చింది. కానీ నేడు ఏపీకి బీజేపీ చేయగలిగే ఏకైక మేలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా. ఈ హోదా ద్వారానే ఏపీ ఆర్థికంగా, అవకాశాల పరంగా మెరుగవుతుందని ఆర్టిక నిపుణులు సైతం పేర్కొంటున్నారు.