మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తరువాత, డీలా పడ్డ నాయకులను, క్యాడర్ ని మళ్ళీ ఆక్టివ్ చేసి, పార్టీని బలోపేతం చేసే దిశగా చంద్రబాబు ఆక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. నేతలు పార్టీ మారుతున్నారు అనే వార్తలతో, క్యాడర్ డీలా పడకుండా, వారిలో ఉత్తేజం నింపేందుకు చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా, అధికార పార్టీ పదే పదే అవినీతి మరకలు వేసి, అవినీతి ఆరోపణలు చేస్తూ ఉండటంతో, ఆ ఆరోపణలు వెంటనే తిప్పి కొట్టేందుకు, కింద స్థాయిలో క్యాడర్ వెంటనే స్పందించే విధంగా, త్రిసభ్య కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ త్రిసభ్య కమిటీలో ఆ జిల్లా అధ్యక్షుడు కూడా ఉంటారు. గుంటూరు జిల్లాకు త్రిసభ్య కమిటీ మెంబెర్స్ గా, పార్టీ సీనియర్ నేత కరణం బలరాం, యనమల రామకృష్ణుడుతో పాటుగా, ఎమ్మెల్సీ ఆశోక్‌బాబును నియమించింది. గతంలో పార్టీలో ఏదన్నా సంక్షోభం వచ్చినప్పుడు, జిల్లాల్లో పార్టీ నాయకులు పార్టీ వీడే సందర్భంలో, లేకపోతే ఇతర క్లిష్ట పరిస్థితుల్లో ఈ కమిటీలు వేసేవారు.
గుంటూరు జిల్లాలాగే, అన్ని జిల్లాల్లో కూడా ఈ త్రిసభ్య కమిటీలు ఏర్పాటు చెయ్యనున్నారు. ఈ కమిటీలు ముఖ్యంగా, జిల్లాలో పార్టీని బలోపేతం చెయ్యటం, పార్టీ పై చేస్తున్న దాడులను ఎదుర్కోవటం, అధికార పార్టీ చేస్తున్న ఆరోపణలు వెంటనే తిప్పి కొట్టే విధంగా, ఈ కమిటీ పని చేయ్యనుంది. ఇప్పటికే చంద్రబాబు కూడా వారినికి 5 రోజులు గుంటూరులోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు. కార్యకర్తల పై వరుస దాడులు తరువాత, వారికి అండగా ఉండేందుకు, వారికి ధైర్యం చెప్పేందుకు, చంద్రబాబు అందుబాటులో ఉంటున్నారు. ప్రతి రోజు కార్యకర్తలను కలిసి, వారి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. అలాగే దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి పార్టీ తరుపున ఆర్ధిక సహయం కూడా చేస్తున్నారు.