ఒకప్పుడు ఆయన, తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి మంచి స్నేహితుడు. అలాంటి నేత కూడా, ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసి, విమర్శలు చేసే పరిస్థితి. ఆయనే పీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి. తులసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని తలుచుకుంటూ, జగన్ మోహన్ రెడ్డి రెండు నెలల పరిపాలన చూసి ఒక సలహా ఇచ్చారు. మరీ ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి వాడే ట్రేడ్ మార్క్ పదాల గురించి మాట్లాడుతూ, జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తరువాత నేను ఒకటి చెప్తున్నా, దయచేసి, ‘మాట తప్పను’, ‘మడమ తిప్పను’,‘విశ్వసనీయత’ వంటి పదాలు నువ్వు వాడమాకు ఆయ్యా జగన్ అంటూ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆ పదాలు వాడే అర్హత నీకు లేదని చెప్పారు.
జగన్ ప్రభుత్వానికి, మాట తప్పడం, మడం తిప్పడం ప్రతి రోజు ఒక దిన చర్యగా మారిపోయిందని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ఆచరణలో పెట్టే వరకు, ఆ మాటలు వాడొద్దు అంటూ తులసి రెడ్డి సూచించారు. రైతులను జగన్ సర్కార్ అడ్డంగా మోసం చేసిందని అన్నారు. జగన మోహన్ రెడ్డి తన పాదయాత్రలో రైతులకు 12500 ఇస్తాం అన్నారని, తరువాత కేంద్రం కూడా 6 వేలు దేశ వ్యాప్తంగా రైతులకు ఇస్తాం అన్నారని, దీంతో రైతులు 18500 వస్తాయని ఆశ పడ్డారని, కాని ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రం, నేను 6500 మాత్రమే ఇస్తాను, మిగతా 6 వేలు కేంద్రం నుంచి తీసుకువచ్చి ఇస్తాను అంటూ, రైతులను మోసం చేసారని అన్నారు. అది పూర్తిగా కేంద్ర పధకం అని, దాని లబ్దిదారులకు, రాష్ట్ర లబ్దిదారులకు తేడా ఉంటుందని, రైతులను మోసం చెయ్యటం కాదా అని తులసి రెడ్డి జగన్ ను ప్రశ్నించారు.
అలాగే సున్నా వడ్డీ రుణాలు 3500 కోట్లు ఇస్తాం అని చెప్పిన జగన్, ఇప్పుడు బడ్జెట్ లో మాత్రం, కేవలం వంద కోట్లు పెట్టి చేతులు దులుపుకున్నారని అన్నారు. అప్పట్లో కేసిఆర్ కడుతున్నవి అక్రమ ప్రాజెక్ట్ లు అని, దాని వల్ల ఏపి రైతులు నష్టపోతారని హంగామా చేసి, ఇప్పుడేమో, అదే ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవానికి అతిధిగా వెళ్ళటానికి సిగ్గులేదా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. అప్పుడేమో 20 మంది ఎంపీలు ఉంటే, మోడీ మెడలు వంచుతా అని చెప్పిన జగన్, ఇప్పుడేమో ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ మాట మార్చరాని అన్నారు. ప్రతి విషయంలో జగన్ మోహన్ రెడ్డి వంచన చేస్తూ, నేను మాట తప్పను, మడం తిప్పను అంటూ, విశ్వసనీయత అంటూ మాటలు చెప్పి, ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.