వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, నగిరి ఎమ్మెల్యే రోజానే షాక్ అయ్యే ఘటన నిన్న నగిరిలో చోటు చేసుకుంది. అందరినీ తన మాటలతో, హావభావాలతో గడగడలాడించే రోజానే, షాక్ అయ్యే పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు. ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజాని జగన్ మోహన్ రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మంత్రి అవ్వాలని కలలు కన్న రోజాకి జగన్ షాక్ ఇవ్వటంతో, ఆమె అలక పాన్పు ఎక్కటంతో, జగన్ ఆమెకు ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా అవకాసం ఇచ్చారు. ఇటీవలే అమరావతిలో ఏపీఐఐసీ చైర్‌పర్సన్‌గా రోజా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో, శనివారం రోజాకు భారీ సన్మాన సభ ఏర్పాటు చేసారు. ఈ ఏర్పాట్లు అన్నీ స్థానిక వైసిపీ నేతలు పోటా పోటీగా చేసారు. ఆమెను పట్టణంలో, ఓపెన్ టాప్ జీప్ లో ఊరేగిస్తూ, ఏజేఎస్ కల్యాణ మండపంలో సన్మాన సభకు తీసుకొచ్చారు.
అయితే ఈ సన్మాన సభలో, నగరి నియోజకవర్గ వైసీపీ బూత్ కమిటీల కన్వీనర్ చంద్రారెడ్డి హడావిడి పై, మరో వర్గం అయిన నగరి మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే కుమార్ రివెర్స్ అయ్యారు. రోజా వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ వేదిక పైకి దూసుకువచ్చి ఎమ్మెల్యే రోజాతో వాగ్వాదానికి దిగారు. హాల్ లో ఉన్న వారి మద్దతుదారుల అరుపులతో కల్యాణ మండపం దద్దరిల్లిపోయింది. కుల అహంకారం ఎక్కవై, తమ లాంటి వారిని దూరం పెడుతున్నారు అంటూ, వేదిక పై తీవ్రంగా గొడవ పడ్డారు. వారి మద్దతదారులు కూడా పైకి వచ్చేయటంతో, పోలీసులు కూడా చేతులు ఎత్తేసారు. ఈ పరిణామంతో, రోజా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏమి జరుగుతుందో అర్ధం కాక, గందరగోళాని గురయ్యారు. కొద్ది సేపటికి కేజే కుమార్ శాంతింపచేసారు. అయినా కూడా తరువాత అదే వాతావరణం కొనసాగింది.
కేజే కుమార్ మాట్లాడుతూ, రోజాని టిడిపిలో నుంచి వైసీపీలోకి తెచ్చింది నేనే అని, అప్పటి నుంచి ఆమెకు అన్నీ దగ్గరుండి చూసుకుంటూ రెండు సార్లు గెలిపించామని అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని గుర్తు చేసారు. తీరా అధికారం వచ్చిన తరువాత, పదవులు వచ్చిన తరువాత, కుల రాజకీయాలు ఎక్కువయ్యాయని, ఎమ్మెల్యే కుటుంబ పాలన ఎక్కువైందని ఆరోపించారు. వీటిని చూస్తూ ఊరుకోం, జగన్ దగ్గర తేల్చుకుంటాం అంటూ, రోజా అక్కడ ఉండగానే వార్నింగ్ ఇచ్చారు.అన్ని కులాల వారూ ఓట్లు వేస్తేనే ఎమ్మెల్యేగా రోజా గెలిచారనేది రోజా గుర్తు పెట్టుకోవలాని అన్నారు. అయితే ఈ పరిణామం ఊహించని రోజా, తమకు అందరూ సమానమే అని, అన్ని కులాలు ముఖ్యమే అని చెప్పారు.