సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారయణ, సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉండగా ఎంత సెన్సేషనల్ అయ్యారో, రాజకీయాల్లోకి వచ్చి అంత పేరు సంపాదించలేదు అనే చెప్పాలి. జగన్ కేసుల్లో కాని, గాలి జనార్ధన్ రెడ్డి కేసుల్లో కాని, ఆయన చూపించిన తెగువకి, దేశ వ్యాప్తంగా మంచి ఆఫీసర్ అని పేరు వచ్చింది. అప్పట్లో మంత్రులుగా ఉన్న మహా మహా నాయకులను కూడా వదిలిపెట్టని లక్ష్మీనారయణ, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు. తరువాత క్రమంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, గ్రామ స్వర్జ్యం పేరిట, ఆంధ్రప్రదేశ్ లో అన్ని గ్రామాలు తిరిగారు. రైతులకు సేవ చెయ్యాలనే ఉద్దేశంతో, ఆయన ప్రయాణం మొదలయ్యింది. తన పర్యటన తరువాత, రాజకీయాల్లోకి వస్తేనే, రైతులకు తాను చెయ్యల్సింది ఇంకా తొందరగా చెయ్యగలను అని నిర్ణయం తీసుకున్నారు.
మొదట్లో లోక్ సత్తా పార్టీలోకి వెళ్తారని, బీజేపీ అని, తెలుగుదేశం పార్టీ అని, ఇలా రకరకాలుగా వార్తలు వచ్చాయి. అయితే జేడీ మాత్రం, చివరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరారు. పోయిన ఎన్నికల్లో ఆయన విశాఖపట్నం నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేసారు. అయితే ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత, ఆయన జనసేనలో ఉన్నట్టే అనిపించినా, తరువాత తరువాత దూరం అవుతూ వచ్చారు. మొన్న ప్రకటించిన జనసేన కమిటీల్లో, లక్ష్మీనారాయణకు కనీసం ఎక్కడా చోటు లేకపోవటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. పవన్ కళ్యాణ్ కు, జేడీకి మధ్య బాగా గ్యాప్ పెరిగిపోయిందని, ఈ సంఘటనతో అర్ధమైపోయింది. దీంతో, అసలు ఎందుకు వీరి మధ్య గ్యాప్ వచ్చింది అనే డిస్కషన్ మొదలైంది.
ఆయన పార్టీ కార్యక్రమాల్లో కంటే, తన సొంత కార్యక్రమాల్లో, ఇమేజ్ పెంచుకునే కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారని, అందుకు తెలివిగా జనసేన కార్యకర్తలని వాడుకుంటున్నారని, అది పవన్ కళ్యాణ్ కు నచ్చటం లేదని, అందుకే వీరి మధ్య అలా గ్యాప్ వచ్చిందని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల తరువాత నుంచి, లక్ష్మీనారాయణ, ఆయన ఫౌండేషన్ కు సంబందించిన కార్యక్రమాలు చేసుకుంటూ, దానికి జనసేన కార్యకర్తలను వాడుకుంటున్నారు, ఇదే పవన్ కు కోపం తెప్పించింది అని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే పవన్ ఆయనకు ఏ కమిటీలోనూ చోటు ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే ఆ చర్య తరువాత, లక్ష్మీనారయణ కూడా పవన్ ను కలవటానికి ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ విషయంలో ఎన్నో వార్తలు ప్రచారంలో ఉన్నా, లక్ష్మీనారాయణ కాని, అటు జనసేన వర్గాలు కాని, ఎవరు అధికారికంగా స్పందించలేదు.