బీజేపీ సీనియర్ నాయకురాలు, విదేశాంగ శాఖ మాజీ మంత్రి, సుష్మా స్వారాజ్ నిన్న రాత్రి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఆమె వయసు 67 ఏళ్ళు. అయితే ఆమె హటాత్తుగా చనిపోవటంతో, అందరూ షాక్ లో ఉన్నారు. నిన్న రాత్రి తొమ్మిది గంటల సమయంలో, ఆమె నలతగా ఉందని చెప్పటంతో, కుటుంబ సభ్యులు ఆమెను ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అయితే ఆమెను ఎమర్జెన్సీ వార్డ్ కు తీసుకు వచ్చే లోపే, ఆమె చనిపోయారని డాక్టర్లు చెప్పారు. సుష్మాస్వరాజ్‌కు భర్త స్వరాజ్ కౌశల్, కుమార్తె బన్సూరి ఉన్నారు. సుష్మా చాలా కాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. ఆమె కిడ్నీలుకు కూడా దెబ్బ తినటంతో, ఆమె కోనేళ్ళుగా డయాలసిస్ చేయించుకున్నారు. 2016లో ఆమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
మరో పక్క ఆరోగ్యం బాగోకపోవటంతో, ఆమె మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చెయ్యలేదు. మంత్రిగా ఉండగా కూడా ఆమె ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉండేవారు. ప్రతి ఒక్కరికీ ఓపికగా సమాధానం చెప్పే వారు. ట్విట్టర్ లో ఆమె మార్కు సెటైర్ లు కూడా పడుతూ ఉండేవి. అయితే, ఇదే క్రమంలో నిన్న ఆమె చనిపోయే ముందు కూడా, ఆమె చివరి ట్వీట్లో ప్రధాని మోడీకి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేసారు. ఆర్టికల్ 370 రద్దు పై ఆమె ట్విట్టర్ లో స్పందిస్తూ, రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ట్వీట్ చేసారు. ఇది చూడడం కోసమే తాను జీవితకాలం ఎదురుచూశానని ఆ ట్వీట్లో పేర్కుంటూ మోడీకి థాంక్స్ చెప్పారు. ఆమె తరువాత భోజనం చేస్తూ కూడా టీవీ చూస్తూ గడిపారని కుటుంబ సభ్యులు చెప్పారు.
సుష్మాస్వరాజ్ మరణ వార్తా పై చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. అలాగే ప్రధాని మోడీ, సుష్మాస్వరాజ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అలాగే వెంకయ్య నాయుడు, అద్వానీ కూడా ఆమె పార్ధివదేహాన్ని చూసి, కన్నీళ్లు ఆపుకోలేక పోయారు. సుష్మ స్వరాజ్ కు మన తెలుగు రాష్ట్రాలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. విభజన సమయంలో, సోనియా గాంధీని పెద్దమ్మ అని తెలంగాణా వాదులు అనుకున్న వేళ, నన్ను కూడా మీ చిన్నమ్మని అనుకోండి అంటూ సుష్మా తెలంగాణా ప్రజలను కోరారు.