డ్యూటీలో ఉన్న ట్రాఫ్ఫిక్ పోలీస్ ఆఫీర్ పై బూతులు తిట్టటమే కాకుండా, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ని సైతం కాలుతో తన్ని, అధికార అహంకారం చూపించిన కేసులో, కృష్ణా జిల్లా జగ్గయ్య పేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కొడుకు, సామినేని ప్రసాద్‌ను హైదరాబాబ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఎన్ని రాజకీయ ఒత్తిడులు వచ్చినా, లొంగకుండా, అరెస్ట్ చేసి లోపల వేసారు. అయితే మరో పక్క ఈ రోజు, పోలీసులతో ప్రసాద్ గొడవపడే వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది. ప్రసాద్ ఒక్కడే కాకుండా, ఉదయభాను భార్య కూడా ఆ వీడియోలో పోలీసులను బెదిరిస్తూ కనిపించారు. మీ సంగతి కేసీఆర్ తో చెప్పి, మిమ్మల్ని సస్పెండ్ చేపిస్తా అంటూ ఆమె వీడియోలో, పోలీసులని బెదిరించటం, పోలీసుల పై దురుసుగా ప్రవర్తించటం వీడియోలో కనిపించింది.
హైదరాబాద్, మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధుల నిర్వహిస్తున్న కృష్ణ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఖానామెట్ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్ వద్ద డ్యూటీలో ఉన్నారు. అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ, ఆయన డ్యూటీ చేసారు. ఈ సమయంలో, హైటెక్స్ కమాన్ వైపు నుంచి వస్తున్న ట్రాఫిక్ ను కొద్ది సేపు నిలుపుదల చేసారు. ఈ సమయంలో అటు వైపు నుంచి వస్తున్న ఓ కారు రూల్స్ ని అతిక్రమించి ముందుకు వెళ్ళిపోతూ ఉండటంతో, కానిస్టేబుల్ ఆ కారుని ఆపాడు. అయితే ఆ కారులో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు సామినేని ప్రసాద్ ఉన్నారు. కారు దిగటంతోనే కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. నా కారే ఆపుతావా, నన్ను నువ్వు అంటావా అంటూ కానిస్టేబుల్ తో గొడవకు దిగారు.
అక్కడే ఉండి ఈ గొడవ గమనించిన ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి, అక్కడకు వచ్చి, పోలీసులతో ఇలా మాట్లాడ కూడదు అంటూ వారించారు. అయినా అతను మరీ రెచ్చిపోయాడు. నేను ఎమ్మెల్యే కొడుకుని అంటూ అరుపులు అరవటంతో, అక్కడ ప్రజలు ఎదురుతిరాగారు. దీంతో పోలీసులు అతన్ని స్టేషన్ కు రమ్మని కోరారు. దీంతో మరింత రెచ్చిపోయిన ప్రసాద్, నన్ను స్టేషన్ కు రమ్మంటావా, నేను రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే కొడుకుని అంటూ, ఇన్స్పెక్టర్ ని పక్కకి నెట్టటంతో పాటు, కాలుతో తన్నారు. దీంతో, అక్కడకు వచ్చిన సీఐ ప్రసాద్ ని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై 332, 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఈ రోజు అతన్ని రిమాండ్ కు తరలించారు మాదాపూర్ పోలీసులు.