వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీ, అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా, పోలవరం టెండర్ గురించి చర్చ జరిగే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ కావటంతో, జగన్ మోహన్ రెడ్డి ఏక పక్షంగా నవయుగని తప్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తరుణంలో, కేంద్రం ఆగ్రహం ఉందని తెలుసుకుని, ఏ పరిస్థితిలో అలా చెయ్యాల్సి వచ్చిందో జగన్, ప్రధానికి వివరించనున్నారు. అలాగే విద్యుత్ పీపీఏ ల పై జరుగుతున్న గొడవ, 75 శాతం లోకల్ రిజర్వేషన్ పై కూడా జగన్ మోహన్ రెడ్డి, ప్రధానికి వివరించనున్నారు. దీంతో పాటు, తాను ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా, ప్లీజ్ సార్ ప్లీజ్ అంటూ, ప్రధాని హోదా పై అడుగుతా అని చెప్పిన జగన్, ఈ సారి కూడా హోదా ఇవ్వండి, ప్లీజ్ సార్ ప్లీజ్ అనే అవకాసం కూడా ఉంది.
అయితే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన నేపధ్యంలో, ఆయన ఢిల్లీకి వెళ్ళే ముందే బీజేపీ తన అజెండాని కూడా రాజకీయంగా సెట్ చేసి పెట్టినట్టు ఉంది. జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యెక హోదా అనేది ఎప్పుడో ముగిసిపోయింది అని, దాని గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నారు అంటే, ప్రజలను మభ్యపెట్టటమే అని అన్నారు. ప్రత్యెక హోదా గురించి, పనీ పాట లేకుండా ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడతారని అన్నారు. రాజకీయంగా ఏ పని లేకపోతే, వారికి ప్రత్యెక హోదా అనేది ఒక కాలక్షేపం సబ్జెక్ట్ అయిపోయిందన్నారు. జగన్ పర్యటనకు ముందు జీవీఎల్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి.
జగన్ ఢిల్లీ టూర్ రెండు రోజుల పాటు ఇలా సాగనుంది. మంగళవారం ఉదయం 9.30కి తాడేపల్లిలోని తన నివాసం నుంచి జగన్ ఢిల్లీకి బయలుదేరతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. అలాగే మరుసటి రోజు అంటే రేపు బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 11.30 గంటలకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో జగన్ భేటీ అవుతారు. రేపు మధ్యాహ్నం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశం అయ్యి, రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న అంశాల పై చర్చిస్తారు. తరువాత తిరిగి రేపు సాయంత్రం 6 గంటలకు తాడేపల్లి చేరుకుంటారు.