పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఏమి జరుగుతుంది ? అసలు పనులు జరుగుతున్నాయా ? ఎప్పటి నుంచి పనులు ఆగాయి ? నవయుగ ఎందుకు పంపించారు ? కొత్త టెండర్ కు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెళ్తుంది ? ఈ అంశాల అన్నిటి పై సమగ్ర నివేదిక ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ను ప్రధానమంత్రి కార్యాలయం నివేదిక కోరింది. జగన్ మోహన్ రెడ్డిని కలిసే ముందే, అన్ని వివరాలు ప్రధాని తెలుసుకుని, అందుకు అనుగుణంగా చర్చలు జరిపే అవకాసం ఉంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోడీని కలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే అంతకంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి వివరాలు తెలుసుకుంది పీఎంఓ. ఒక వేళ కొత్త టెండర్ పిలిస్తే, ఎదురయ్యే పరిణామాలు ఏంటి, కేంద్రం పై ఎంత భారం పడుతుంది వంటి అంశాలు పై వివరణ కోరారు.
దీనికి సంబంధించి, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రాధమిక నివేదికను ప్రధాని కార్యాలయానికి ఇచ్చిందని తెలుస్తుంది. జగన్ మోహన్ రెడ్డి పోలవరం పై చెప్పే వివరణను బట్టి, ప్రధాని ఆ నివేదికలోని అంశాలు బేరీజు వేసుకుని, మాట్లాడనున్నారు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి, ప్రధాని, అమిత్ షా తో భేటీ తరువాత, పోలవరం పై ఒక స్పష్టత వచ్చే అవకాసం ఉంది. ఇది ఇలా ఉంటే, పోలవరం ప్రాజెక్ట్ టెండర్ ని రద్దు చేస్తూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, నవయుగని బయటకు పంపించి రివర్స్ టెండరింగ్ కి పిలవటం పై, పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే దీని పై, కేంద్ర జల వనరుల శాఖమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమాధానం ఇస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు బట్టారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఆశ్చర్యాన్ని కలిగించిందని, దీని వల్ల పోలవరం ప్రాజెక్ట్ మరింత ఆలస్యం అయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకొందో అర్ధం కావటం లేదని అన్నారు. మరో పక్క ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది జాతీయ హోదా కలిగిన ప్రాజెక్ట్. మొత్తం కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తుంది. మొన్నటి దాకా చంద్రబాబు ప్రభుత్వంలో, రాష్ట్రం పర్యవేక్షణ చేసి, పనులు పరగులు పెట్టించారు. మరో పక్క కేంద్ర ప్రభుత్వం అన్ని ఖర్చులు ఆడిట్ చేసి, తరువాతే రీయింబర్స్‌మెంట్ చేసేవారు. నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ ను థర్డ్‌పార్టీగా నియమించి, ఆ సంస్థ నివేదికలు ఆధారంగా డబ్బుల ఇచ్చే వారు. దీని పై కూడా వైసీపీ ఎంపీ అడిగిన ప్రశ్నకు, పోలవరంలో ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం చెప్పిన విషయం తెలిసిందే.