రాష్ట్రంలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. ఎక్కడైనా ప్రజలు తప్పు చేస్తే, పోలీసులు మందలిస్తారు. కాని మన రాష్ట్రంలో పోలీసులు తప్పు చేస్తుంటే, ప్రజలు మందలించిన సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైనా అత్యంత విలువైంది ఉంది అంటే అది బంగారం కాదు, డైమండ్ కాదు, డబ్బు కాదు.. అదే ఇసుక.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఇసుక కోసం తపించి పోతున్నారు. దాదపుగా 20 లక్షల మంది కార్మికులు ఇసుక లేక రోడ్డున పడ్డారు. ఇసుక లేక అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు ఇసుక బస్తాలలో అమ్ముతున్న పరిస్థితి వచ్చింది. సిమెంట్ బస్తా కంటే, ఇసుక బస్తా రేటు ఎక్కువ ఉంది. ఇలాంటి ఇసుక కోసం, ఇప్పుడు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి. ఇసుక బంగారం అయ్యి కూర్చుంది. దీంతో ఇప్పుడు పోలీసులు కూడా దొంగ చాటుగా తెచ్చుకునే పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే, జగన్ మోహన్ రెడ్డి ఇల్లు ఉంటున్న తాడేపల్లి పోలీసులకు ఇసుక సెగ తగిలింది. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక చిన్న బాత్ రూమ్ కట్టేందుకు, పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎక్కడా ఇసుక దొరకటం లేదు. బ్లాక్ లో కొందాం అంటే, వేలకు వేలు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో పోలీసులకు ఏమి చెయ్యాలో అర్ధం కాలేదు. అయితే వారికి ఒక ఆలోచన వచ్చింది. సరిగ్గా వీరు ఈ ఇబ్బంది పడుతున్న టైంలోనే, ఇసుక అక్రమంగా తరలిస్తున్నారని, నాలుగు ట్రాక్టర్ లని పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ నాలుగు ట్రాక్టర్లలో కేవలం ఒక్క ట్రాక్టర్ మాత్రమే లోడ్ అయ్యి ఉంది. మిగతా మూడు ట్రాక్టర్లు ఖాళీగా ఉన్నాయి. దీంతో తాడేపల్లి పోలీసులకు ఒక ఐడియా వచ్చింది. ఈ ఖాళీగా ఉన్న ట్రాక్టర్లు తీసుకుని బయలుదేరారు.
చివరకు దగ్గరలో ఉన్న ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లి, ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని, స్టేషన్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేసారు. అయితే ఇంతలో అక్కడ ఉన్న గ్రామస్తులు, పోలీసులు చేస్తున్న పనిని చూసి అవాక్కయ్యారు. ఒక పక్క సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు, పనులు లేక కూలి పని చేసుకునే వారు ఇబ్బందుల్లో ఉన్నారు, అలాంటిది ఇలా ఎలా చేస్తారు అంటూ పోలీసులకు అడ్డం తిరిగారు. అయితే మేము పోలీసులమని, ఈ ఇసుక మా సొంతానికి కాదు, పోలీస్ స్టేషన్ లో బాత్ రూమ్ కట్టటానికి అని చెప్పారు. అయినా గ్రామస్తులు వినలేదు. ట్రాక్టర్ ని అడ్డుకున్నారు. రూల్స్ ఎవరికైనా ఒకటే ఉంటాయని, అది ప్రజలు అయినా, ప్రభుత్వం లో ఉన్న వారు అయినా, పోలీసులు అయినా అంటూ ఎదురు తిరిగారు. దీంతో వ్యవహారం ముదరటంతో పోలీసులు అక్కడ నుంచి జారుకున్నారు. ఇవండీ మన రాష్ట్రంలో ఇసుక కష్టాలు.