జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంతో, రాజకీయంగా సఖ్యతగా ఉన్నట్టు బీజేపీ కనిపిస్తున్నా, కేంద్ర ప్రభుత్వ పరంగా మాత్రం, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే పనుల పై మాత్రం, చాలా గుర్రుగా ఉంది. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి ఆడుతున్న డబల్ గేమ్ ని, ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారు. ఢిల్లీ పెద్దల దగ్గర మాత్రం జగన్, విజయసాయి రెడ్డి వినయం నటిస్తూ, అంతా మీ తరువాతే అన్నట్టు అక్కడ చెప్తున్నారు. రాష్ట్రానికి వచ్చి మాత్రం, కనీసం కేంద్రానికి కూడా సమాచారం ఇవ్వకుండా, వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలు కూడా, లెక్క చెయ్యకుండా, కేంద్రానికి చెప్పకుండా, జగన్ మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు నిర్నయం తీసుకోవటం పై కేంద్రం గుర్రుగా ఉంది. కనీసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కూడా చెప్పకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవటంతో, కేంద్రం కోపంగా ఉంది.
రాజకీయంగా మంచి సంబంధాలు ఉన్నా, రూల్స్ ప్రకారం నడవాల్సిన చోట, కేంద్రం జగన్ ప్రభుత్వానికి షాకులు మీద షాకులు ఇస్తుంది. విద్యుత్ ఒప్పందాల సమీక్షలో కేంద్రం వద్దు అని ఎంత చెప్పినా, జగన్ ప్రభుత్వం మాత్రం, మేము సమీక్షించి తీరుతాం అంటూ, కేంద్రాన్ని ధిక్కరించి, చివరకు విదేశీ పెట్టుబడులకు గండి కొట్టే పరిస్థితి వచ్చింది. మరో పక్క పూర్తిగా కేంద్ర పరిధిలో ఉన్న పోలవరం పై, జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం పై కేంద్రం గుర్రుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న పోలవరం ప్రాజెక్ట్ విషయంలో, ప్రధాన కాంట్రాక్టర్ గా ఉన్న నవయుగ కంపెనీని, కేంద్రానికి చెప్పకుండా, రాష్ట్రం పంపించేసింది. దీని పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం ఆరా తీసింది.
జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి సంజయషీ ఇచ్చినా కూడా, కేంద్రం మాత్రం సంతృప్తి చెందలేదు. ఇదే కాకుండా, పర్యావరణ అనుమతులు ఎందుకు రద్దు చెయ్యకూడదు అంటూ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ తరుణంలో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ నెల 13న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి వచ్చి, సమాధానం చెప్పాలని, ఏపీ జలవనరుల శాఖ, కేంద్ర జలవనరులశాఖ అధికారులకు పిలుపు వచ్చింది. ఎందుకు నవయుగని తప్పించారు ? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ముందుగా ఎందుకు సంప్రదించలేదు ? కొత్త టెండర్ పిలిస్తే, నవయుగ చేసిన రేటుకే, కొత్త సంస్థ చేసే అవకాసం ఎంత వరకు ఉంది, ఇలాంటి అంశాల అన్నిటి పై, రాష్ట్రాన్ని వివరణ కోరనున్నారు. మరో పక్క, ఈ వ్యవహారం పై, ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ప్రధాన మంత్రి కార్యాలయానికి ప్రాధమిక నివేదిక ఇచ్చినట్టు సమాచారం.