రాష్ట్ర శాసనమండలిలో ఖాళీ అవుతున్న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవడంతో... టిక్కెట్లు ఆశిస్తున్న ఆశావహుల్లో సందడి మొదలైంది. వీటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఫిబ్రవరి 10న ఎన్నికల సంఘం నుంచి ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. శాసనసభ్యుల కోటాలోని 5 స్థానాల్లో పదవీ విరమణ చేస్తున్న వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, పి.శమంతకమణి, అంగూరి లక్ష్మీ శివకుమారి ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న గాదె శ్రీనివాసులునాయుడు, తూర్పు-పశ్చిమగోదావరి, గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ప్రాతనిధ్యం వహిస్తున్న కలిదిండి రవికిరణ్ వర్మ, బొడ్డు నాగేశ్వరరావుల సభ్యత్వం కూడా ముగియనుంది.
శాసనసభలో ప్రస్తుతం ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే... ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 4 తెదేపాకి, ఒకటి వైకాపాకి వస్తాయి. 4 స్థానాల్లో ఒకటి మళ్లీ యనమల రామకృష్ణుడికే కేటాయించడం దాదాపు ఖాయం. మంత్రి నారాయణ ఈసారి నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు. వంగవీటి రాధాకృష్ణ తెదేపాలో చేరితే.... ఆయనకు విజయవాడ సెంట్రల్ టిక్కెట్ ఇవ్వలేని పక్షంలో, ఎమ్మెల్సీగా పంపించే అవకాశం ఉంది. ఏపీ ఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు, త్వరలో తెదేపాలో చేరనున్న ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పదవులను ఆశిస్తున్నారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినా... ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుతో అభ్యర్థులు బరిలోకి దిగుతారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పీఆర్టీయూ తరపున ప్రస్తుత ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు మళ్లీ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం పద్మనాభం మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రఘువర్మ ఏపీటీఎఫ్ తరపున... సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పనిచేసిన అడారి కిశోర్‌కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. తూర్పు-పశ్చిమగోదావరి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
అక్కడ ప్రస్తుత ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మ లేదా ఆయన తండ్రి ‘చైతన్య’ రాజు పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే ఐ.వెంకటేశ్వరరావు (పీడీఎఫ్), బండారు సూర్యనారాయణమూర్తి (ఐఎన్టీయూసీ), ఎన్.శేషారెడ్డి (ఆదిత్య విద్యాసంస్థల అధినేత), టి.కె.విశ్వేశ్వరరెడ్డి (రాజమహేంద్రి విద్యా సంస్థలు), హిప్నో కమలాకర్ (ప్రజాశాంతి పార్టీ), మాగంటి చినబాబు, పోతుల వెంకట విశ్వం (కైట్ విద్యా సంస్థల కరస్పాండెంట్) పోటీకి సిద్ధమవుతున్నారు. భాజపా కూడా ఒక అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని భావిస్తోంది. గుంటూరు-కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పోటీ చేయడం లేదు. పీడీఎఫ్ తమ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు పేరు ఇప్పటికే ప్రకటించింది. వీరితో పాటు తెదేపా నాయకులు రాయపాటి శ్రీనివాస్ (మాజీ ఎమ్మెల్సీ), పోతినేని శ్రీనివాస్, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, దాసరి రాజా మాస్టారు, టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి, తదితరులు పోటీ చేయాలని భావిస్తున్నారు. తెదేపా మద్దతుతో బరిలోకి దిగే అభ్యర్థులు ఎవరన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరోపక్క ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలపై వైకాపా ఇంత వరకు తన వైఖరేంటో స్పష్టం చేయలేదు.