అమరావతిలో ఒకే రోజు శాశ్వత హై కోర్టుకు శంకుస్థాపన, తాత్కాలిక హై కోర్టు ప్రారంభోత్సవం జరగనున్నాయి. రేపు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ చేతుల మీదుగా 11 గంటలకు ప్రారంభోత్సవం జరగనుంది. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తులు,ఏపీ,తెలంగాణ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఆర్డీఏ కమీషనర్ శ్రీధర్ హై కోర్ట్ ప్రారంభోత్సవం పనులు పరిశీలించారు. ఆరు నెలల్లో జ్యూడిషల్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 23 కోర్టు హాళ్లు ఏర్పాటు చేసినట్టు తెలియజేసారు. హై కోర్టు ప్రారంభానికి వచ్చే న్యాయమూర్తులు, ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అమరావతి చరిత్రలో ఇదొక అద్భుత ఘట్టంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు.
సీఆర్డీ యే అధికారులతో టెలీకారన్ఫరెన్స్ నిర్వహించారు చంద్రబాబు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ మహత్తర ఘట్టం రాష్ట్ర చరిత్రలో నిలచిపోనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. న్యాయ వ్యవస్థ సమగ్ర కార్యకలాపాలకు అమరావతి విశిష్ట కేంద్రంగా మారనుందన్నారు. అందులో భాగంగానే ఐకానిక్ హైకోర్టు కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఐదు అత్యుత్తమ ప్రపంచ శ్రేణి రాజధానుల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రను తిరగరాస్తున్నారని, అమరావతి తెలుగు ప్రజలకు గర్వకారణమని, అభివృద్ధికి చిహ్నమని సీఎం స్పష్టం చేశారు. దాదాపు 62 సంవత్సరాల తర్వాత విజయవాడ-గుంటూరు ప్రాంతంలో హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభమవడం ద్వారా నవశకం ప్రారంభమైందన్నారు.
భారత ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ ఒక బలమైన స్తంభంగా ఆయన పేర్కొన్నారు. కొత్త రాజధానిలో న్యాయ కార్యకలాపాలు ప్రారంభం కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన గొగోయ్ రాష్ట్ర తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ప్రారంభించనుండటం మనకు గర్వకారణమన్నారు. రాబోయే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దేశంలోనే ఉత్తమ న్యాయస్థానంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా అమరావతిలో న్యాయ నగరాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. న్యాయ నగరాన్ని 450 ఎకరాల్లో రెండు దశల్లో నిర్మిస్తామని తెలిపారు. తొలి దశ 2022 నాటికి పూర్తవుతుందని, రెండో దశ 2036 నాటికి పూర్తవుతుందని వివరించారు.