నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో జ్యూడీషియల్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రారంభోత్సవం, శాశ్వత హైకోర్టు భవనం శంకుస్థాపన కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సుభా్‌షరెడ్డి, ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ హైకోర్టు సీజే రాధాకృష్ణన్, ఏపీ సీఎం చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీజేఐ గొగోయ్ మాట్లాడారు. న్యాయం, నైతిక విలువలు కలిసి ప్రయాణం చేస్తాయన్నారు. ఇచ్చిన తీర్పులను న్యాయమూర్తులు తమకు తాముగా సమర్ధించుకోవడం కాదని, రాజ్యాంగం సమర్ధించేలా ఉండాలన్నారు. అమరావతిలో భారీ భవంతిలో ప్రారంభమైన హైకోర్టు భవనాన్ని న్యాయానికి ప్రతీకగా ఉండేలా చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ హైకోర్టును అంకిత చేస్తున్నానని అన్నారు.
రాజ్యాంగ ధర్మాన్ని చంద్రబాబు బాగా నిర్వర్తించారని పేర్కొన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు ఇద్దరూ కలిసి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠ పెంచాలని బార్ న్యాయవాదులకు అప్పీల్ చేశారు. న్యాయ వ్యవస్థలో 5వేల ఖాళీలు జిల్లాల స్థాయి న్యాయవ్యవస్థలో ఉన్నాయని వీటిని భర్తీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో 392 జడ్జిల పదవులు ఖాళీగా ఉండగా, హైకోర్టు కొలీజియంలు సిఫార్సు చేయక 270 పోస్టుల భర్తీ నిలిచిందని వివరించారు. హైకోర్టు భవనం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు.
‘వ్యక్తుల భావోద్వేగాలు వ్యవస్థల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం విచారకరం. ఇటీవల కాలంలో ఆ సమస్యల్ని ధీటుగా ఎదుర్కొన్నాం’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. భారత న్యాయవ్యవస్థ శక్తిమంతం కావడానికి న్యాయమూర్తులు, న్యాయవాదుల సమష్ఠి కృషే కారణమని అన్నారు. కోర్టులు అన్ని వేళలా ప్రజల పక్షానే నిలుస్తున్నాయని, ఇది న్యాయవ్యవస్థకూ, ప్రజలకూ మధ్యగల విశ్వాసానికి రుజువన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు వారి పై కవిత వినిపించారు. "తెలుగువాడు దేనికైనా సైసై.. తెలుగువారి ధీశక్తి.. తెలుగువారి క్రియాశక్తి.. నలుదెసలా రహించాలి..తెలుగుతనం జయించాలి.. కోట్లాది తెలుగుజాతి హర్షించాలి.. తెలుగువాడి తెలివితేటలకు జైజై.. తెలుగువాడు దేనికైనా సైసై.. తెలుగువారి నెదురాడు వాడు నైనై" అంటూ కవిత పాడి వినిపించారు.