నవ్యాంధ్రలో కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడ్డారు. దీనిని నీచాతినీచమైన చర్యగా అభివర్ణించారు. ఓటమి భయంతోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎన్డీఏలోకి రాకుండా తలుపులు మూసేశామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోమవారం సాయంత్రం ఢిల్లీలో విలేకరులతో, ఉదయం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం మాట్లాడారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే కులాల మధ్య జగన్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెదేపానేనని సీఎం స్పష్టం చేశారు.
తన పార్టీలో, ప్రభుత్వంలో అన్ని కులాలూ ఉన్నాయని.. జగన్ ఒక కులానికి వంతపాడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ‘కులాలకు, అధికారులకు సంబంధమేంటి..? ఏ కులానికి చెందిన కార్యదర్శులు ఎక్కువగా ఉన్నారు..? దాదాపు అన్నికులాల వాళ్లు ఉన్నారు. మంత్రుల్లో నలుగురు రెడ్లు ఉన్నారు. ఏకులానికి అన్యాయం జరిగింది...? సామాజిక న్యాయం చేయడంలో నేను ముందుంటా’ అని స్పష్టం చేశారు. ఆంధ్రలో వేడుకగా జరుగుతున్న పింఛన్లు, పసుపు-కుంకుమ చెక్కుల పంపిణీ భగ్నానికి కూడా జగన్ కుట్ర పన్నారని, శాడిజంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ‘వైసీపీ సైకో పార్టీగా మారింది.
రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటోంది. పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తోంది. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే వైసీపీ ఉద్దేశం. అభివృద్ధికి అడ్డుపడడం దాని సైకో ధోరణికి నిదర్శనం. పింఛన్ల సభలను భగ్నం చేయడం సైకో పోకడ. పసుపు-కుంకుమ భగ్నం చేయడం జగన్ శాడిజానికి నిదర్శనం. ఓట్ల తొలగింపు పేరుతో ఢిల్లీలో జగన్నాటకం నడుపుతున్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈసీకి వైసీపీ ఫిర్యాదు చేసింది’ అని నేతలకు సూచించారు. అన్ని వర్గాల బాగుకోసమే ఫెడరేషన్లు పెట్టి ప్రోత్సహిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. మోదీ పక్షాన జగన్ ఉండటం చూసి మైనార్టీలు ఆయనకు దూరం అయ్యారన్నారు. జగన్కు ఉన్న కుల పిచ్చి ఏమిటో అందరికీ తెలుసని చంద్రబాబు వ్యాఖ్యానించారు.