‘మొరిగే కుక్కలకు బెదిరేదిలేదు. ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, మాకు అండగా నిలిచిన ప్రజలకు మాత్రమే భయపడతాం..’ అని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత వైసీపీ నేతలను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెట్టింపు పింఛన్లు, పసుపు-కుంకుమ సొమ్ము అందజేత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆమె ఆత్మకూరు మండలం తోపుదుర్తిలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగపూరితంగా మాట్లాడారు. టీడీపీకి, తమ కుటుంబానికి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు గ్రామాల్లో చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. తోపుదుర్తిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రూ.60 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించామన్నారు. స్త్రీనిధి ద్వారా పొదుపు మహిళలకు రూ.5 కోట్ల రుణాలు అందించామన్నారు. హంద్రీనీవా ద్వారా గ్రామంలోని రెండు చెరువులు నీటితో నింపామన్నారు. ఈ రోజు ఆ గ్రామం చుట్టూ పచ్చదనం కనిపిస్తోందంటే అది హంద్రీనీవా నీరు వల్ల కాదా అని ప్రశ్నించారు. ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్న తోపుదుర్తి కుటుంబం అదే నీటితోనే పంటలు పండించుకోవడం లేదా అని ప్రశ్నించారు.

పార్టీలకతీతంగా గ్రామాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టి తోపుదుర్తి గ్రామాన్ని అభివృద్ధి చేశామన్నారు. మహిళలకు ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యం ఇచ్చి పసుపు-కుంకుమ కార్యక్రమం చేపడితే అది చూసి ఓర్వలేకే వైసీపీ నాయకులు దుర్బుద్ధితో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని సమస్యలు వచ్చినా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందన్నారు. పచ్చని పల్లెల్లో చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేపడితే తాము భయపడమని, కేవలం అభివృద్ధికే తాము ప్రాధాన్యమిస్తామన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా నీళ్లొచ్చిన తరువాత ఇతరులకు కూలికి వెళ్లకుండా గ్రామస్థులు తమ పొలాల్లోనే పంటలు పండించుకుని ప్రశాంతంగా జీవనం సాగిన్నారన్నారు. దీన్ని చూసి ఓర్వలేక గ్రామంలో తోపుదుర్తి కుటుంబీకులు చిచ్చు పెడుతున్నారన్నారు. అభివృద్ధికి సహకరించాలని, ప్రశాంతంగా జీవనం సాగించే అమాయకపు ప్రజలకు ఇబ్బంది కల్పించవద్దని కోరారు. మహిళా మంత్రిగా గ్రామంలోకి తాను వస్తే వైసీపీ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నించడం బాధాకరమన్నారు. గ్రామాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేయడం తప్పా అని ఉద్వేగపూరితంగా ప్రశ్నించారు. మహిళలకు ఇచ్చే పసుపు-కుంకుమ విలువ తెలియని వైసీపీ నాయకులకు మాట్లాడే హక్కు లేదన్నారు. ఎంతోమంది మహిళల పసుపు-కుంకుమ తుడిపేసిన వారికి దాని విలువ ఏమి తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో ప్రతి మహిళా తమ తోబుట్టువులా భావించి పసుపు-కుంకుమ ద్వారా చెక్కులు అందిస్తామని, పార్టీలకతీతంగా అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకునేలా చూస్తామన్నారు.

తోపుదుర్తిలో ఉద్రిక్తత.. తోపుదుర్తి గ్రామంలో ఆదివారం పసుపు-కుంకుమ కార్యక్రమం ఉద్రిక్తత మధ్య జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన మంత్రి పరిటాల సునీతను గ్రామంలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని గ్రామానికి చెందిన వైసీపీ మహిళా కార్యకర్తలు రోడ్డుపై భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వైసీపీ నాయకులు ముందస్తుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మంత్రి కాన్వాయ్‌ని పోలీసులు ఆపారు. అలాగే పరిటాల శ్రీరామ్‌ కాన్వాయ్‌ని కనగానపల్లి మండలం బోగినేపల్లి వద్ద ఆపారు. గ్రామంలో నిరసన వ్యక్తం చేస్తున్న విషయం మంత్రి దృష్టికి ఎస్పీ తీసుకెళ్లారు. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ షెడ్యూల్‌ మేరకు తోపుదుర్తిలో సభ నిర్వహించాల్సిందేనని మంత్రి పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో నిరసన వ్యక్తం చేస్తున్న మహిళా వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేసి వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేశారు. అనంతరం తోపుదుర్తి గ్రామంలో యథావిధిగా మంత్రి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read