విభజన హామీల సాధనే లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అమరావతి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, బీఎస్పీ, ఎస్పీ, ప్రజాశాంతి పార్టీ, నవతరం పార్టీ, ఆమ్ఆద్మీ పార్టీ, వివిధ ఉద్యోగ సంఘాలు, ఎన్జీవోలు, గెజిటెడ్ అధికారులు, రెవెన్యూ, సచివాలయ ఉద్యోగులు హాజరయ్యారు. వైకాపా, కాంగ్రెస్, భాజపా, జనసేన, వామపక్షాలు హాజరుకాలేదు. ఏపీ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా ఆందోళనలు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు చెప్పారు. 11న ఢిల్లీలో ఆందోళన చేస్తామని, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిలపక్షం వెళుతుందని ఈ మేరకు అఖిలపక్ష సమావేశంలో తీర్మానం చూసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
‘‘నేను చేయాల్సినంత చేశాను. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడికి ఇప్పటికే రెండు సార్లు అఖిలపక్ష భేటీ నిర్వహించాం. హోదా సహా చట్టంలో అంశాల అమలుకు విశ్వప్రయత్నాలు చేశాం. లోటు బడ్జెట్లో భర్తీ చేయాల్సిన మొత్తం కూడా ఇంత వరకు సరిగా ఇవ్వలేదు. విభజన జరిగినప్పుడు రాజకీయ పక్షాలు, వివిధ రకాల నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రజా, ఉద్యోగ సంఘాలన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటాలు చేశాయి. విశాఖ రైల్వే జోన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఒడిశా అభ్యంతరం లేదని చెప్పినా రైల్వేజోన్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారు. లాభాలొచ్చే పోర్టులైతేనే కావాలని కేంద్రం అంటోంది. మహారాష్ట్రకు భారీగా కరవు నిధులిచ్చి మనల్ని చిన్న చూపు చూశారు’’ అని సీఎం వివరించారు.
‘‘హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారు. నన్నుదొంగదెబ్బ తీసేందుకే కన్నాతో కేసు వేయించారు. దొడ్డి దారిలో వస్తున్నారు. అందుకే సీబీఐకి అనుమతి ఇవ్వలేదు. ఈడీని ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు. గజ తుపానులో కేంద్రం నిర్లక్ష్యాన్ని మధురై ప్రజలు మరచిపోలేదు. మోదీ పర్యటనలో నల్ల జెండాలు, బెలూన్లతో నిరసన తెలిపారు. ఎవరైనా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పకుండా కేసులు పెడుతున్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులన్నీ ఎత్తివేస్తాం. రేపు జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుంటాం. కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకుని కేసులు ఎత్తివేస్తాం. ఈవిషయమై ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తాం. ’’ అని చంద్రబాబు వివరించారు.