అమరావతిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ రాజకీయాల్లో తన జూనియర్ అని, అయినా మోదీ అహాన్ని సంతృప్తిపరచడానికి తాను ‘సార్’ అని పిలిచేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. తాను అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను కలిసిన సందర్భంలో కూడా ఆయనను మిస్టర్ క్లింటన్ అని మాత్రమే సంబోధించానని.. ‘సార్’ అని పిలవలేదని చెప్పారు. కానీ మోదీ ప్రధానిగా అయిన తర్వాత ఆయనను ఇప్పటిదాకా దాదాపు 10సార్లు ‘సార్’ అని పిలిచానని చంద్రబాబు తెలిపారు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. మోదీ అహం సంతృప్తి చెందేలా ‘సార్’ అని పిలిచానని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. 2014లో రాష్ట్రానికి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని.. పొత్తు పెట్టుకోకుండా ఉంటే 10సీట్లు ఎక్కువే గెలిచేవాళ్లమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.
మరో పక్క అఖిలపక్ష సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్లమెంటు సమావేశాలు జరిగే 13 రోజుల పాటు రాష్టవ్య్రాప్తంగా వివిధ రూపాల్లో నిరసన.. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెల ఒకటో తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్నందున నల్లబ్యాడ్జీలతో బ్లాక్‌డే పాటించి నిరసన తెలపాలని, 11న ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష.. 12న రాష్టప్రతిని కలసి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాలని బుధవారం రాత్రి సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం తీర్మానించింది. ప్రత్యేక హోదా, విభజన హామీల జేఏసీ పేరిట కమిటీ ఏర్పాటయింది. శుక్రవారం ప్రత్యేక హోదా
సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బంద్‌కు బయట నుంచి మద్దతివ్వాలని నిర్ణయించారు.
ప్రభుత్వం మరో ప్రభుత్వంపై చేసే పోరాట కార్యక్రమంగానే దీన్ని పరిగణిస్తామని ఇది రాజకీయ పోరాటం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మోదీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు చేసే వ్యక్తులు, పార్టీలకు మద్దతిస్తే రాష్ట్రానికి అన్యాయమే మిగులుతుందని రాష్ట్రానికి న్యాయం జరిగి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలుపుకునేందుకే ఈ పోరాటం చేస్తున్నామని వివరించారు. అందరినీ కలుపుకుని ఐక్య పోరాటం చేయటం ద్వారా హక్కులు సాధించుకుందామని ఉద్ఘాటించారు. కొంతమందికి రాజకీయ అజెండా ఉంది.. మేం రాష్ట్ర భవిష్యత్ కోసం ఉద్యమిస్తున్నాం.. చివరి బడ్జెట్‌కు వచ్చింది.. ఇప్పుడేదో చేస్తారని కాదు.. మనకు అన్యాయం చేసిన వాళ్లకు మన సత్తా ఏంటో చూపాలన్నారు. బడ్జెట్‌ను అంతా వ్యతిరేకించాలని దేశం మొత్తంగా నిరసన ధ్వనులు వినిపించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశాన్ని రెండు ముక్కలు చేయాలని చూస్తున్నారు.. మతాలు, కులాల వారీగా విడదీస్తున్నారు.. విద్వేషాలు పెంచేలా వ్యవహరిస్తున్నారు.. విభజించి పాలించాలని కుట్ర పన్నుతున్నారు.. రాష్ట్రాల్లో అశాంతిని ప్రేరేపించి అస్థిరత సృష్టించటమే ఆయన అజెండా అని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.