ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి గర్వకారణమైన అద్భుత ఘట్టం ఈ రోజు మొదలైంది. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తరువాత రాష్ట్రంలో ఏర్పాటైన దక్షిణ కొరియాకు చెందిన ప్రతిష్ఠాత్మక కియా మోటార్స్ కార్ల పరిశ్రమ నుంచి తొలికారు మంగళవారం దర్జాగా.. దర్పంగా బయటకు వచ్చింది. మేడిన్ ఏపీ అంటూ రాష్ట్ర కీర్తి పతాకను సగర్వంగా రెపరెపలాడించింది. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే రెండో జిల్లాగా, రాష్ట్రంలో కరవుకు ప్రతిరూపంగా పేరుగాంచిన అనంతపురం జిల్లా.. ఇకపై కార్ల తయారీ కేంద్రంగా ఖ్యాతిగడించింది. అనంతపురం జిల్లా ఎర్రమంచి వద్ద కియా తొలికారును చంద్రబాబు ప్రారంభించారు. ఎర్రమంచిలో ప్రతిష్ఠాత్మక కియా కార్ల సంస్థ నుంచి తొలి కారు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో కియా మోటార్ ప్లాంట్ నిర్మాణం చేపట్టామని సీఎం చెప్పారు. 2017లో నిర్మాణం ప్రారంభించి ట్రయల్ ప్రొడక్షన్ స్థాయికి చేరుకుందని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ఎక్కడైనా నెగ్గుకురాగలరని అన్నారు.
కియా పెట్టుబడులతో అనంతపురం ప్రాంతం ఆటో మొబైల్ పారిశ్రామిక హబ్‌గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో హీరో మోటార్స్, అపోలో టైర్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్డ్ వంటి సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ వంటి విధానాలు తీసుకొచ్చామని చంద్రబాబు వివరించారు. కియా మోటార్స్‌కు భారత్ అతిపెద్ద మార్కెట్ అవుతుందని.. ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని కొరియా అధికారులు, సిబ్బందికి సీఎం సూచించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ట్విట్టర్ లో పెట్టిన ఒక పోస్ట్ కి, సినీ హీరో రాం, స్పందించారు. చంద్రబాబు పెట్టిన ట్వీట్ ఇది... "Just a few years ago nobody would’ve believed that so many industries would come to @anantapurgoap. Due to State govt’s relentless efforts to ensure water supply in this area, we could attract major investments. Now Rayalaseema has become the industrial hub of AP. #KiaMadeInAP"... దానికి సినీ హీరో రాం స్పందిస్తూ, "This is so true..a Massive step forward for our state! Many more to come! #KiaMadeInAP". సినీ హీరో రాం స్వస్థలం విజయవాడ అన్న సంగతి అందరికీ తెలిసిందే.