రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేసుకోవాలంటూ కేంద్రం ఈమధ్యనే ఉత్తర్వులు జారీచేయడంతో ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా హైకోర్టును ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఉన్నపళంగా హైకోర్టు విభజన ఏమిటంటూ ఏపీ ప్రభుత్వం విమర్శలు చేసినా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదు. త్వరలోనే నూతన భవనంలోకి ఏపీ హైకోర్టును మార్చనుండగా ఇప్పటికే భవనం సిద్ధమైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా నూతనం భవనంలో హైకోర్టు ప్రారంభం కానుంది. అయితే ఏపీ హైకోర్టు విభజన అసలు రాజ్యాంగ విరుద్ధమన్నారు జస్టిస్ జాస్తి చలమేశ్వర్.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఏర్పాటు చేస్తున్న విధానం రాజ్యాంగ విరుద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియాతో మాట్లాడిన జస్టిస్ జాస్తి రాజ్యాంగం ప్రకారం హైకోర్టు ఏర్పాటుపై పార్లమెంటు నిర్ణయం తీసుకుంటుందని అక్కడ నుండి వచ్చిన సిఫార్సుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుందన్నారు. కానీ ఇక్కడ పార్లమెంటును పక్కనపెట్టి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నిర్ణయం తీసుకున్నారనీ, ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని విమర్శించారు. దేశంలోని ప్రతీ రాజ్యాంగ వ్యవస్థ ఇలానే తయారైందన్న జాస్తి ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుందన్న నమ్మకం తనకు లేదని.. మన దేశ ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే కాపాడాలని కుండబద్దలు కొట్టారు.
జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జూన్ 2018లొ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. ఆయన 2011 అక్టోబరు 10న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. ఆయన 2018 జనవరి 12న మరో ముగ్గురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై ఆరోపణలు చేశారు. న్యాయమూర్తులు ఈ విధంగా బహిరంగ వేదికపై న్యాయ వ్యవస్థపై విమర్శలు చేయడం ఇదే తొలిసారి కావడంతో పెను సంచలనం నమోదైంది. వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు ఇచ్చిన 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ కూడా ఉన్నారు.