ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో బసవ తారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తామని ఇదివరకే హామీ ఇచ్చిన ఆయన.. దాన్ని చేతల్లో చేసి చూపారు. బసవతారకం క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు ఈరోజు భూమిపూజ జరిగింది. బాలకృష్ణ దంపతులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి కోడెల శివప్రసాదరావు, ప్రముఖ వైద్యుడు దత్తాత్రేయుడు నోరి, మంత్రులు నారా లోకేశ్, ప్రత్తిపాటి ఆనంద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
వైద్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శంకుస్థాపన సందర్భంగా యాగాన్ని నిర్వహించారు. రెండేళ్లలో ఈ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బాలకృష్ణ వెల్లడించారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు నామమాత్రపు ఛార్జీలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తామని అన్నారు. తన తల్లి పేరు మీద ఉన్న ఈ ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన సహాయ, సహకారాలను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అనంతరం మంత్రి లోకేష్ బాబు మాట్లాడుతూ, కేన్సర్ చికిత్స కోసం వ్యాధిగ్రస్తులు ఇక హైదరాబాద్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అన్నారు.
ఎన్టీఆర్ భార్య బసవ తారకం క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఆమె పడిన ఇబ్బందులు మరొకరు పడొద్దనే తపనతో హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్‌కు అంకురార్పణ చేశారు. 2000లో నాటి ప్రధాని వాజ్‌పేయి చేతుల మీదుగా హైదరాబాద్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్నవారికి తక్కువ ఖర్చుతోనే ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య ఖర్చులు చెల్లించే స్థోమత లేని వారికి ఉచిత వైద్యంతో పాటు కార్పస్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం కూడా చేస్తున్నారు. గత ఏడాది జూలైలో విజయవాడలోని సూర్యరావు పేటలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌ను ప్రారంభించారు. వారంలో రెండు రోజులపాటు డాక్టర్లు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నారు.