పారిశ్రామికవేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు తిరిగి హైదరాబాద్‌ చేరింది. దర్యాప్తు మొత్తం ఇక.. ఇక్కడినుంచే సాగుతుంది. ఇన్నాళ్లూ ఏపీ పోలీసులు చేసిన దర్యాప్తు నివేదిక అందగానే.. కార్యాచరణ ప్రారంభం కానుంది. ఈమేరకు ఏపీ డీజీపీ ఉత్తర్వులు జారీచేశారు. ఆరు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు ఇక.. ఒక రాష్ట్రానికే పరిమితం కానుంది. హత్య తెలంగాణలోని హైదరాబాద్‌లో జరిగితే.. మృతదేహం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో దొరికింది. అంటే.. డెడ్‌బాడీని రెండు వందల కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి పోలీసులకు సవాల్‌ విసిరారు నిందితులు. అంతేకాదు.. రాష్ట్రం సరిహద్దులు కూడా దాటించడంతో.. ఈ హత్య కేసు రెండు రాష్ట్రాల పోలీసుల సమస్యగా తయారైంది. అయితే.. ఇప్పుడు ఏపీ పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయంతో కేసు ఒకే రాష్ట్రానికి పరిమితం కానుంది.

మృతుడు అమెరికా పౌరసత్వం కలిగి ఉండటంతో పాటు.. పారిశ్రామిక వేత్త కావడంతో ఏపీ పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించారు. అనేక కోణాల్లో దర్యాప్తు చేశారు. అనుమానితులందరినీ ఆగమేఘాల మీద అదుపులోకి తీసుకొని.. కృష్ణా జిల్లా తరలించారు. ఆరు రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. స్వయంగా కృష్ణా జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కూడా నిందితులను విచారించారు. తాము చేపట్టిన దర్యాప్తులో బయటపడిన అంశాలను మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి. హత్యకు ముందు జరిగిన పరిణామాలు, హత్య తర్వాత సాగిన దర్యాప్తు వివరాలన్నీ తెలియజేశారు. ప్రధాన నిందితుడిచ్చిన సమాచారం ఆధారంగానే సేకరించిన వివరాలు వన్‌ బై వన్‌ చెప్పారు. అప్పటికే జయరామ్‌ మేనకోడలు శిఖాచౌదరికి ఈ హత్య కేసుతో సంబంధం లేదని తేల్చారు. నిందితురాలిగా చేర్చేందుకు అవసరమైన ఆధారాలు గానీ, డేటా గానీ ఏదీ లభించక పోవడంతో.. ఆమెను వదిలేశారు. ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ పెట్టిన కృష్ణా జిల్లా ఎస్పీ త్రిపాఠి.. ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డితో పాటు.. మరో వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ప్రకటించారు.

మరుసటిరోజుకు పరిణామాలు మారిపోయాయి. ఈ కేసును ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ పోలీసులకు బదిలీ చేశారు. ఈమేరకు ఏపీ డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ ఉత్తర్వులు జారీచేశారు. వాస్తవానికి మొదటినుంచీ ఈకేసులో ఈ తరహా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతూనే ఉంది. హత్య హైదరాబాద్‌లో జరగడం, నిందితుడి ఇల్లు కూడా హైదరాబాద్‌లోనే ఉండటం.. మర్డర్‌ప్లాన్‌ స్కెచ్‌ కూడా ఇక్కడి నుంచే సాగడం.. ఇలా అన్ని అంశాలూ హైదరాబాద్‌తోనే ముడిపడి ఉండటంతో.. కేసు దర్యాప్తు హైదరాబాద్‌ పోలీసులకు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అలా అనుకున్నట్లే.. ఏపీ పోలీసులు జయరాం హత్యకేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఇప్పటికే పలు మలుపులు తిరిగిన జయరాం హత్య కేసు దర్యాప్తు.. ఇక తెలంగాణలోని జూబ్లీహిల్స్ పోలీసులు చేపట్టనున్నారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read