కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా దిల్లీలోని ఏపీ భవన్ వద్ద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు భాజపా మిత్రపక్షం శివసేన కూడా మద్దతు తెలిపింది. ఆ పార్టీ తరఫున సంజయ్ రౌత్ వచ్చి చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో నిర్వహించిన ధర్నాకు కూడా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించిన శివసేన కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఎన్డీఏ సర్కారుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్న నేతల్లో చంద్రబాబు కూడా ఒకరుగా ఉన్నారు. భాజపాతో మిత్రత్వాన్ని తెంచుకుంటున్నట్లు శివసేన ఇప్పటికీ స్పష్టంగా ప్రకటన చేయలేదు.
అయితే, ఎన్డీఏకి వ్యతిరేకంగా పోరాడుతున్న చంద్రబాబు దీక్షకు మద్దతు తెలుపుతూ భాజపాకు తాము వ్యతిరేకమే అనే సంకేతాలను శివసేన ఇచ్చింది. ఇది ఓ కీలక పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొన్ని నెలలుగా ఎన్డీఏపై శివసేన తీవ్ర విమర్శలు చేస్తోంది. మహారాష్ట్రలో భాజపా,శివసేన మధ్య పొత్తుపై ఇప్పటికీ చర్చలు ప్రారంభం కాలేదు. భాజపాయే తమను దూరం చేసుకుంటోందని శివసేన ఆరోపిస్తోంది. ఎన్డీఏతో శివసేన దూరం మరింత పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే అనేక మిత్రపక్షాలు బీజేపీని వదిలి వచ్చేసాయి. శివసేన , బీజేపీతో వ్యతిరేకిస్తున్నా, ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే, ఇప్పుడు చంద్రబాబు దీక్షకు వచ్చి మద్దతు తెలపటంతో, షా, మోడిలకు షాక్ ఇచ్చినట్టు అయ్యింది.
మరో పక్క, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్రలో పొత్తులు కొనసాగించే విషయంలో భారతీయ జనతా పార్టీ, శివసేన మధ్య ఇప్పటికీ చర్చలు జరగలేదన్న విషయం తెలిసిందే. భాజపా మాత్రం తమ ఏర్పాట్లలో నిమగ్నమైపోతోంది. అవసరమైతే ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ముంబయిలోని ఆరు స్థానాల్లో భాజపా ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. ఈ ఆరు స్థానాల్లోని పోలింగ్ కేంద్రాల్లో తమ పార్టీ బాధ్యులని నియమించింది. తమ కార్యకర్తలతో కలిసి పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఆరు స్థానాల్లో మూడింటికి భాజపా నేతలు ఎంపీలుగా ఉండగా, మరో మూడు స్థానాలకు శివసేనకు చెందిన నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.