వచ్చే ఎన్నికలలో పోటీ చేసే ఎమ్మల్యే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికలలో పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఆ మేరకు అమరావతిలోని సీఎం నివాసగృహంలో వారితో విడివిడిగా భేటి అయిన చంద్రబాబు పోటీకి సిద్ధమవ్వాలని ఆదేశించటంతో పాటు పలు సూచనలు, హెచ్చరికలతో కూడిన ప్రత్యేక నివేదికలను వారికి అందజేశారు. దర్శి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు, పర్చూరు, గిద్దలూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలకు ఆయన తిరిగి పోటీకి పచ్చజెండా ఊపారు. రాష్ట్రంలోని పదిహేను మంది టీడీపీ నేతలకు బుధవారం ముఖ్యమంత్రిని కలవాలన్న సమాచారం అందింది. అందులో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు, ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్‌రెడ్డిలకు సీఎం ఫేషీ నుంచి పిలుపొచ్చింది.
ముగ్గురు నేతలతో బుధవారం రాత్రి ఆయన విడివిడిగా మాట్లాడారు. తొలుత మంత్రి శిద్దాతో బాబు మాట్లాడారు. ముందుగా జిల్లాలోని రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని కూడా శిద్దా ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అనంతరం దర్శి విషయాన్ని ప్రస్తావిస్తూ ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావచ్చు. మీ జాగ్రత్తల్లో మీరు ఉండండని సూచించినట్లు తెలిసింది. ప్రత్యేక నివేదికలను ఆయనకు అందజేశారు. ఎంత మెజారిటీ సాధించగలమన్న నమ్మకం ఉందో తెలపాలంటూ శిద్దా చెప్పిన సమాచారానికి బదులుగా ఇంకా మెజారిటీ పెరగాలని సూచించినట్లు తెలిసింది. ఆయా అంశాలకు సంబంధించిన సమాచారంతో కూడిన నివేదికను కూడా ఇచ్చినట్లు తెలిసింది.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. పోటీకి సిద్ధం కమ్మని స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వటంతో పాటు పలురకాల అంశాలకు సంబంధించి ఏలూరి ద్వారా తెలుసుకున్నట్లు తెలిసింది. అభివృద్ధి సాధనలో ముందున్నారు, రాజకీయంగా నిర్థిష్ట విధానంతో నడుస్తున్నారు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే చక్కగా పరిష్కరించుకుంటున్నారు అని అంటూ గతం కన్నా మెజారిటీ పెరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏలూరికి కూడా పలు అంశాలకు సంబంధించిన నివేదికను ఇచ్చి వాటిని పరిశీలించి అనుసరించమని ఆదేశించినట్లు తెలిసింది. బాగా పొద్దుపోయిన తర్వాత గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డితో కూడా ఆయన మాట్లాడారు. తిరిగి గిద్దలూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తూనే పలు అంశాలపై సూచనలు, జాగ్రత్తలు చెప్పినట్లు తెలిసింది. అయితే ముందుగానే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కి, ఒంగోలు లోక్‌సభ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినందున మరోసారి వారిని పిలుస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.