ఆంధ్రా ప్రజల వార్తలు అవసరం లేదు కానీ, మీ రాజకీయాల కోసం ఆంధ్రులు అవసరమా అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత ప్రశ్నించారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆంధ్రుల వార్తలు, సమస్యలు మాకు అవసరం లేదని కేటీఆర్ మాట్లాడటం ఆయన ఫ్యూడల్ మనస్తత్వానికి నిదర్శనమని, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు మేలు చేసేందుకే మీరు ఆంధ్రావార్తలు రాయవద్దని, చదవద్దని అంటున్నారా అని ప్రశ్నించారు.
దేశ, విదేశాల్లోని వార్తలను తెలుసుకోవాలని ప్రజలందరికీ ఉంటుందని, అటువంటిది మన తోటి తెలుగు ప్రజలు ఎలా ఉన్నారో, వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో తెలుసుకోవడం తప్పెలా అవుతుందన్నారు. గతంలోనూ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో మీడియాపై ఆంక్షలు పెట్టి ఏ విధంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడిందో బహిరంగ సత్యమేనన్నారు. దేశంలోనే ఆంధ్రాలో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి జరుగుతుంటే తెలంగాణ ప్రజలకు తెలిస్తే తమను ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం కేటీఆర్‌కు పట్టుకుందన్నారు. ప్రతిపక్ష నాయకుడిని ఆసరాగా చేసుకుని టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రంలో అడుగు పెడితే ఇక్కడి ప్రజలు మీకు సహకరించకపోగా, తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
మా పథకాలు కాపీ కొట్టారని కేటీఆర్ చెప్పడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని, సంక్షేమ పథకాల అమలులో చంద్రబాబుకు మరెవరూ సాటి లేరని, రారని అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి చంద్రబాబు తన అనుభవంతో లోటుబడ్జెట్ నుంచి మిగులు బడ్జెట్‌వైపు తీసుకెళ్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మిగులు బడ్జెట్ నుండి లోటుబడ్జెట్ వైపు తీసుకెళ్లారని ఎమ్మెల్యే అనిత దుయ్యబట్టారు.