వైసీపీకి రాజీనామా చేసిన రాధా, ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. వైసీపీలో చాలా అవమానాలు ఎదుర్కొన్నానని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ఈ అవమానాలు వేరెవరికీ జరగకూడదన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన తండ్రి అభిమానులను సంతృప్తి పరిచేందుకే ఆయన విగ్రహావిష్కరణకు వెళ్లానన్నారు. విగ్రహావిష్కరణకు ఎందుకు వెళ్లావంటూ వైకాపా నేతల తనను మందలించారన్నారు. తండ్రి లేనివాడినని చేరదీశానని.. చెప్పినట్లు వినాల్సిందేనంటూ వైకాపా అధ్యక్షుడు జగన్ ఒత్తిడి చేసేవారని రాధా ఆరోపించారు. ఇప్పటికైనా జగన్ పద్ధతి మార్చుకుని రంగా అభిమానులను గౌరవించాలని ఆయన సూచించారు.
తనను పిలిపించిన ఆయన ఎవరిని అడిగి వెళ్లావని ప్రశ్నించారని, వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ కి ఎందుకు సమాచారం ఇవ్వలేదని అడిగారని, తండ్రిలేని వాడివని జాలిని చూపిస్తూ, పార్టీలో ఉండనిస్తున్నానని, ఇది తన పార్టీ అని చెప్పారని ఆరోపించారు. ఇలా జరగడం ఒకసారి కాదని, పదే పదే తనపై జాలిని చూపిస్తున్నానని ఆయన అంటుంటే ఎలా తట్టుకోగలనని ప్రశ్నించారు. వైసీపీ జగన్ పార్టీయేనన్న విషయాన్ని తాను కూడా అంగీకరిస్తున్నానని, ఆయన ఒక్కరే పార్టీని ఏలుకోవచ్చని విమర్శలు చేశారు. తన తండ్రి విగ్రహావిష్కరణకు వెళ్లాలంటే, తాను ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదని, అలా తీసుకోవాల్సి వస్తే, అసలు ఆ పార్టీయే తనకు అవసరం లేదని రాధా అన్నారు.
ప్రజాజీవితంలో ఆంక్షలు లేకుండా పని చేయాలనుకున్నానన్నారు. రంగా ఆశయం నెరవేరుస్తానని.. పార్టీలో చేరేటప్పుడు జగన్ మాటిచ్చారని రాధా చెప్పారు. సొంత తమ్ముడికన్నా ఎక్కువ అన్నారని.. కానీ ఆ తమ్ముడినే ఇలా చూస్తే.. సామాన్య ప్రజలను ఎలా చూస్తారు అని ప్రశ్నించారు. వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నా.. భరిస్తూ వచ్చానన్నారు. తన తండ్రి ఆశయం నెరవేర్చడానికే పార్టీలో కొనసాగానన్నారు. కానీ దాన్ని కాపాడలేకపోయారని తెలిపారు. అన్ని కులాలు, మతాలు, పార్టీల్లో రంగా అభిమానులున్నారని చెప్పారు. తానేదైనా పిలుపునిస్తే, తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, వైసీపీ వాళ్లంతా వస్తారని వంగవీటి రాధా వ్యాఖ్యానించారు. 30 ఏళ్లు అవుతున్నా.. రంగాను దేవుడిగా భావిస్తున్నారు. జాలి చూపిస్తే.. రాజకీయాల్లో లేను. అభిమానంతోనే ముందుకు వెళ్లాను.. జగన్ తన పద్ధతి మార్చుకోవాలి’ అంటూ రాధా ఆవేశంగా మాట్లాడారు.