ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని 18 అంశాల అమలును కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని బృందం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు కలవనుంది. రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రపతిని కలవాలని మొదట నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్ కేవలం 11 మందికే అవకాశమివ్వడంతో ఆ మేరకే నేతలను తీసుకొని వెళ్లనున్నారు. కొద్ది సేపటి క్రిందట ఆంధ్రప్రదేశ్ భవన్ నుంచి పాదయాత్రగా బయలుదేరి రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు.
రాష్ట్రపతిని కలిసే బృందంలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, మంత్రులు- కళా వెంకట్రావు, నక్కా ఆనంద్‌బాబు, అమరావతి ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆంధ్ర మేధావుల ఫోరం ఛైర్మన్ చలసాని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఐకాస అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఏపీ ఏన్జీవోల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సినీ పరిశ్రమ ప్రతినిధి శివాజీ ఉంటారు. ఏపీకి విభజన హామీల అమలు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తుందంటూ ఆయన సోమవారం ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష నిర్వహించారు.
ఏపీ సీఎం దీక్షకు కాంగ్రస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎస్సీ నేత ములాయం సింగ్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో సహా ప్రముఖ జాతీయ నేతలంతా మద్దతు పలికారు. ప్రధాని మోదీ వైఖరిని ఎండగట్టారు. ఏపీకి కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఇవాళ కూడా ఢిల్లీలోనే మకాం వేసిన ఏపీ సీఎం రాష్ట్రపతిని కలిసేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకొని..ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ధర్మపోరాట దీక్షతో ఏపీకి జరిగిన అన్యాయాన్ని దేశమంతా చాటిచెప్పామని ఆయన అన్నారు. మనం ఏకాకులం కాదని.. యావత్ దేశమంతా ఏపీకి అండగా ఉందని చెప్పారు. బీజేపీ అండ్ కో తప్ప..అన్ని పార్టీలూ దీక్షకు సంఘీభావం తెలిపాయన్నారు చంద్రబాబు.