గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పరితపిస్తూ వారి మధ్యలోనే నివసిస్తూ వారు తినేదే తింటూ తనను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంచిన తండ్రి సర్వేశ్వరరావు మరణవార్తతో షాక్‌కు గురైన తనకు కళ్లవెంట నీరు కూడా రాలేదని, అయితే ఆ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తమను ఓదార్చిన తీరు చూసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యానని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఎంతో భావోద్వేగంతో అన్నారు. శాసనసభలో గురువారం సర్వేశ్వరరావు సంతాప తీర్మానంపై సీఎంతోపాటు అనేక మంది సభ్యులు మాట్లాడిన తర్వాత చివరగా శ్రావణ్‌కుమార్ తన తండ్రి గురించి ఇంత గొప్పగా చెబుతాన్నారంటే ఆయన ఎంతటి పేరు తెచ్చుకున్నారో ఇప్పుడు తెలుస్తోందంటూ ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
తన తండ్రి హత్య కంటే ఓ మంచి వ్యక్తి, తెలివైన యువ నేత హత్యకు గురికావటంతో ఒక గిరిజనుడిగా తాను బాధపడుతున్నానన్నారు. అసలు నక్సల్స్ ఏం సాధించారు.. దీనివల్ల గిరిజన ప్రాంతాల అభివృద్ధి 30ఏళ్ల వెనక్కి పోయిందనేది గుర్తించగలరన్నారు. వారికి పోయింది రెండు బుల్లెట్లేనన్నారు. అయితే పోయింది రెండు ప్రాణాలు, ఇద్దరు ఆడపడుచులు తమ భర్తలను కోల్పోయారు, పిల్లలు తమ తండ్రులను కోల్పోయారు, వారి బాధను ఎవరు తీర్చగలరన్నారు. నక్సల్స్ కనీసం ముందస్తు హెచ్చరిక చేసి ఉంటే తన తండ్రి తన వైఖరిలో ఏమైనా లోపముంటే ఆలోచించి మార్చుకుని ఉండేవారు కదా అని అన్నారు.
గిరిజన నేతలను మట్టుపెట్టుకుంటూ పోతే గిరిజనుల బతకుల్లో ఎలా దీపాలు వెలుగుతాయన్నారు. శాసనసభ సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ బడాబాబులు, పెత్తందారులు, బూర్జువాలకు తాము వ్యతిరేకమనే నక్సల్స్ అతి సామాన్య గిరిజనులను ఎలా హత్య చేశారని ప్రశ్నించారు. అసలు వారిని ఎందుకు చంపారో చెప్పలేదంటే కేవలం తమ ఉనికి లేదా సంచలనం కోసమే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అని ప్రశ్నించారు. చివరగా సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించి నివాళులర్పించారు.