ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జట్టుకట్టిన విపక్ష కూటమిలో అనేక పార్టీలు ఆయా రాష్ట్రాల్లో ఎవరిదారిన వారు పోటీ చేస్తున్న విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏపీలో కూడా తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయడం లేదని, కాంగ్రెస్ నేతలే ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించారని బాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు వెళ్లేదిలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. ఈవీఎంలపై చాలా మందికి అనుమానాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీయేతర నేతల సమావేశంలో ఈవీఎంలపై చర్చించామని తెలిపారు. ప్రజస్వామ్యాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే అంశం పై చర్చ జరిగిందన్నారు. సబ్ కమిటీ రిపోర్ట్‌పై చర్చించి, ఆమోదించామన్నారు.
ఈవీఎంల వల్ల ఎవరికి ఓటు వేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. సోమవారం సాయంత్రం 5.30 గంటలకు కేంద్ర ఎలక్షన్ కమిషన్‌ను కలుస్తున్నట్లు వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని బట్టి ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న అంశంపై చర్చిస్తామని స్పష్టం చేశారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య రైతుల సమస్య అన్నారు. 4 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రభుత్వం ఎక్కడ కూడా చేయలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వ్యవసాయ వృద్ధి కేవలం 2.4 శాతం మాత్రమేనన్నారు. రైతులకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని పెద్ద ఎత్తున పీడిస్తున్న మరో సమస్య ఉపాధి లేక పోవడం, నిరుద్యోగ సమస్య అని వివరించారు.
ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తూ వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తుందని ధ్వజమెత్తారు. ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ అనే నినాదంతో ముందుకు వెళ్తున్నామని స్పష్టంచేశారు. దేశాన్ని కాపాడుకోవాలని, అందుకు అందరం కలవాల్సి ఉందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి బీజేపీకి వ్యతిరేకంగా ముందుకు వెళ్లాలని సూచించారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో రైతాంగం ఒకటని, నాలుగేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న బీజేపీ, కనీస మద్ధతు ధర కూడా కల్పించలేకపోతోందని విమర్శించారు. మరో తీవ్రమైన సమస్య నిరుద్యోగమని, ఈ విషయంలో ఎన్డిdయే సర్కారు ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు.మరోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలను రాజకీయ కక్షసాధింపు కోసం ఉపయోగిస్తూ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని ప్రధాని మోడీపై ఆరోపణలు సంధించారు. అందుకే తాము సేవ్ నేషన్ – సేవ్ డెమోక్రసీ నినాదంతో ముందుకెళ్తున్నామని తెలిపారు.