2014 సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకొచ్చిన మోదీ ప్రభుత్వం... చివరి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. విభజనతో నష్టపోయిన ఏపీని ఆదుకొంటామని నాడు హామీ ఇచ్చిన బీజేపీ... ఇప్పటి వరకూ ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లలో రాష్ర్టానికి మొండి చేయే చూపింది. చివరి బడ్జెట్‌లో అయినా కేంద్రం న్యాయం చేస్తుందా? లేదా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. విభజన చట్టం ప్రకారం, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులను ఇవ్వాలని సీఎం అడుగుతున్నారు. ఇందులో అత్యంత ప్రధానమైంది... ఏపీకి ప్రత్యేక హోదా. రెండోది 2014-15కి సంబంధించిన రెవెన్యూ లోటు. ప్రత్యేక హోదా కింద ఏపీకి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, ఈఏపీ రుణాల్లో 90శాతం భారం కేంద్రం భరించడం, కేంద్ర ప్రాయోజిత పథకాల్లోనూ 90 శాతం నిధులను కేంద్రమే భరించాల్సి ఉంది. కానీ, ఇందులో ఏ ఒక్క విధానాన్నీ కేంద్రం అమలుచేయడం లేదు.
2014-15కి సంబంధించి ఏపీ రెవెన్యూలోటు రూ.16,000 కోట్లు ఉంది. ఇందులో ఇప్పటి వరకు రూ.3979 కోట్లుమాత్రమే రాష్ట్రానికి వచ్చింది. మిగిలిన రూ.12,000 కోట్లను ఇవ్వకుండా తప్పించుకోవడానికి కేంద్రం రకరకాల సాకులు చెప్తోంది. విశాఖ రైల్వేజోన్‌కు ఒడిసా అభ్యంతర పెడుతోందంటూ కేంద్రం కారణం చూపిస్తోంది. కానీ, విశాఖ రైల్వేజోన్‌పై తమకెలాంటి అభ్యంతరమూ లేదని ఒడిసా ఇప్పటికే స్పష్టం చేసింది. పోలవరం నిర్మాణం కోసం రాష్ట్రం ఖర్చుపెట్టిన నిధుల్లో ఇంకా రూ.4,000 కోట్లను కేంద్రం రీయింబర్స్ చేయాల్సి ఉంది. వెనుకబడిన జిల్లాలకు ఇస్తున్న రూ.350 కోట్లను గత ఫిబ్రవరిలో రాష్ట్రానికి ఇచ్చినట్టే ఇచ్చి కేంద్రం వెనక్కు తీసేసుకుంది. ఆ నిధులను, ప్రస్తుత సంవత్సరానికి ఇవ్వాల్సిన మరో రూ.350 కోట్ల నిధులను ఇవ్వాల్సి ఉంది. వీటిపై చివరి బడ్జెట్‌లో అయినా కనికరిస్తుందో లేదో మరి.
అయితే, ఏపీకి న్యాయం చేస్తారని ఇన్నాళ్లు ఎదురుచూశామని, సహనం నశించి పోయిందని..ఏపీకి మోదీ చేసిందేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఎలక్షన్ మిషన్‌పై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాల దృక్పథం గురించి మోదీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ప్రతిపక్షాలపై ఈడీ, ఐటీ దాడులు విశాల దృక్పథమా? అని ప్రశ్నించారు. బీజేపీయేతర పార్టీలే లక్ష్యంగా కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు తెలిపారు. సమైక్యాంధ్ర, ప్రత్యేక హోదా ఉద్యమ కేసులు ఎత్తివేశామని చెప్పారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడేవారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు.