2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీ వంద శాతం అమలు చెయ్యటానికి చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయాలను అందిస్తున్నారు. అయితే ఎన్నికలకు వెళ్తున్న వేళ, దీన్ని రెట్టింపు చేసి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ నెరవేర్చే విధంగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతువు పెన్షన్‌ను రెట్టింపు చేశారు. మహిళలకు పసుపు కుంకుమ-పేరుతో పదివేల రూపాయలిస్తున్నారు. రైతులకు నగదు బదిలీ చేస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి పెంచుతామని టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు.
నిరుద్యోగ భృతి రూ. 1000 నుంచి రూ. 2000 వరకు పెంచి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ భృతి పెంపు అంశాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామని ఆయన చెప్పారు. ఎన్నికల్లోపే నిరుద్యోగ భృతి పెంపును అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 2014లో హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన చేసి ఆంధ్రులను కట్టుబట్టలతో నడిరోడ్డుపైకి నెట్టేశారు. రూ.16 వేల కోట్ల ఆర్థిక లోటుతో చంద్రబాబు పాలన ప్రారంభించారు. అయినా ఇచ్చిన అన్ని హామీలను అమలుచేశారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణ ఉపశమనం, పింఛను మొత్తం ఐదురెట్లు పెంచడం, 24 గంటల విద్యుత్ సరఫరా..ఇలా అన్నీ నురవేర్చారు.
నిరుద్యోగ భృతిని ఈ తరహాలో అమలు చేయడం దేశంలోనే ప్రథమం. కేరళ, పశ్చిమబెంగాల్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో అమలుచేశారని.. కానీ ఆయా రాష్ట్రాల్లో నెలకు రూ.120, రూ.200, రూ.500 చొప్పునే ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చారు కానీ ఆరు నెలల్లోనే పథకాన్ని ఎత్తేశారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న అర్హులందరికీ, కుటుంబంలో ఒకరికి అనే పరిమితి లేకుండా ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా ఏపీయే . ఆయా రాష్ట్రాలతో పాటు అమెరికా, ఐర్లాండ్, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో అమలుచేస్తున్న నిరుద్యోగ భృతిని కూడా పరిశీలించారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామని, సమాజానికి ఉపయోగపడేలా, విజ్ఞాన సమూహంలా యువతను తీర్చిదిద్దుతామని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.