తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు పరమభక్తులన్న విషయం అందరికీ తెలిసిందే. స్వామివారిపై తన భక్తిని చంద్రబాబు మరోసారి చాటుకున్నారు. రాజధాని నగరంలో వెంకటేశుడి ఆలయ నిర్మాణానికి సంబంధించి భూకర్షణ పనులు గురువారం జరిగాయి. సీఎం చంద్రాబు చేతుల మీదుగా పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనల్ని ఆశీర్వదించడానికి శ్రీవారు అమరావతికి వచ్చారు. ఆయన మా కులదైవం. ఆయన పాదాల దగ్గర పుట్టాను. ఆయన నాకు పునర్జన్మ ఇచ్చారు. 2003లో అలిపిరిలో జరిగిన అతిపెద్ద ప్రమాదంలో బతికి బయటపడతానని ఎవరూ ఊహించి ఉండరు. అలాంటి ప్రమాదం నుంచి నన్ను రక్షించారు. వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఆగమశాస్త్రానుసారం భూకర్షణ జరిపి పనులు ప్రారంభించాం. 25 ఎకరాల్లో దేవాలయాన్ని నిర్మిస్తున్నాం. వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండాలనే తలంపుతో ... ఉచితంగా టీటీడీకి భూమి ఇస్తున్నాం. నేను కానీ, పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కానీ.. వెంకటేశ్వరుని సేవలో సాంప్రదాయబద్ధంగా, నియమనిబద్ధలతో ఉన్నాం. అమరావతిలో వెంకటేశ్వరస్వామి దేవాలయం కట్టడం... దానికి ప్రత్యక్షసాక్షులు కావడం మనందరి అదృష్టం. ప్రపంచమంతా హిందువులు భక్తిభావంతో కొలిచేదైవం .. మన రాష్ట్రంలో ఉండటం మనందరి పూర్వజన్మ సుకృతం. అమరావతికి వెంకటేశుడి ఆశీస్సులు కావాలి. కృష్ణానదికి ఈ పక్కన వెంకన్న.. ఆ పక్కన దుర్గమ్మ ఉన్నారు. దీని రక్షణగా ఉన్నారు. వీరిద్దరి ఆశీస్సులతో అభివృద్ధిలో దూసుకుపోతాం. పవిత్ర దివ్యక్షేత్రంగా.. శాశ్వతంగా ఈ ఆలయం నిలిచిపోవాలని టీటీడీని కోరాను’’ అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు.
ఈసందర్భంగా ఈవో అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పదిరోజుల పాటు వైదిక కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఆలయ నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సీఆర్డీఏ కేటాయించిన 25 ఎకరాల స్థలంలో 7 ఎకరాల్లో రూ.150 కోట్ల వ్యయంతో రాతి కట్టడంతో శ్రీవారి ఆలయం నిర్మిస్తున్నట్లు చెప్పారు. టెండర్లు పూర్తియ్యాయని, రెండు సంవత్సరాల కాలంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. మిగిలిన 18 ఎకరాల స్థలంలో మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా పెద్ద పట్టణాలు, పుణ్యక్షేత్రాల్లో ఆలయాల నిర్మాణం చేపడుతున్నామన్నారు.
ఇందులో భాగంగా హర్యానా రాష్ట్రం కురుక్షేత్రంలో రూ.34.60 కోట్లతో, తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రూ.22.50 కోట్లతో శ్రీవారి ఆలయాలు నిర్మించామన్నారు. ఒడిశా రాజధాని భవనేశ్వర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి రూ.7.5 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో రూ. 7.90 కోట్లతో, ఏజెన్సీ ప్రాంతాలైన శ్రీకాకుళం జిల్లా సీతంపేట, విజయనగరం జిల్లా పార్వతీపురం, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతాల్లో కలిపి రూ.13.50 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. చెన్నైలో రూ. 5.75 కోట్లతో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ది, లోకకల్యాణం కోసం ఫిబ్రవరి 7 నుండి 10వ తేది వరకు అష్టోత్తర శతకుండాత్మక శ్రీనివాస యాగం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అనిల్ కుమార్ వివరించారు.