ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ తో హోదా సాధన సమితి పిలుపు మేరకు ఏపీ బంద్ విజయవంతంగా సాగుతోంది. ఈ బంద్ కు ప్రభుత్వం సహా అన్ని పార్టీలూ, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విజయవాడలోని నెహ్రూ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు. చలసానితో పాటు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, సపీఐ నేతలు పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, హక్కుల సాధనే లక్ష్యంగా చేపట్టిన బంద్‌లో సినీ పరిశ్రమ కూడా పాల్గొనాలని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. ఒక రాష్ట్రం మొత్తం నిరసన తెలుపుతుంటే, తమను ఆదరిస్తున్న వారి తరుపున పోరాడాల్సిన బాధ్యత సినీ పరిశ్రమ పై ఉందని అన్నారు.
ప్రత్యేక హోదా ఉద్యమం కోసం అన్ని పార్టీలు కలిసిరావడం హర్షణీయమన్నారు. స్వచ్ఛందంగా అందరూ బంద్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. ఉద్యోగులు కూడా బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారన్నారు. మధ్యాహ్నం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చలసాని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. మరో పక్క చంద్రబాబు ఈ రోజు మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర స్థాయిలో నిరసనలు చేపట్టాలని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేతలకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 11 నుంచి 14 వరకు జాతీయపార్టీలతో కలిసి దిల్లీలో ధర్మపోరాటం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పిస్తామని వివరించారు. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్తామన్నారు. ప్రజాక్షేత్రంలోనే అమీతుమీ తేల్చుకుంటామన్నారు. రాజకీయాల్లో ప్రతిరోజూ ఎంతో ప్రధానం.. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సీఎం చంద్రబాబు నల్లచొక్కాతో హాజరయ్యారు. ఎమ్మెల్యేలతో పాటు చంద్రబాబు కూడా నల్లచొక్కా ధరించి రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రానికి నిరసన తెలియజేశారు. టీడీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది నల్లచొక్కాల్లోనే అసెంబ్లీకి రాగా, కొందరు నల్లచొక్కా, నల్లప్యాంటు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. అందరూ మూకుమ్మడిగా కేంద్రంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఏపీ హక్కుల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు సీఎం కార్యచరణ ప్రకటించారు. విభజన చట్టం అమలులో కేంద్రం మొండి చేయి చూపిస్తున్నందుకు నిరసనగా ఫిబ్రవరి 1న నిరసన దినంగా పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. ఏపీకి సహకారం అందివ్వడంలో కేంద్రం వివక్ష చూపడానికి నిరసనగా ఎమ్మెల్యేలను నల్లదుస్తులు ధరించాలని సీఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఎమ్మెల్యేలు నల్లదుస్తులు ధరించి అసెంబ్లీకి వచ్చారు.