ఏమి చేస్తారయ్య మముల్ని జైళ్లలో పెడతారా.... మీ అబ్బ సొమ్ము ఇస్తున్నారా.. సిగ్గు కూడా లేదా మీకు... ఏమి చేస్తారయ్యా మీరు.. తెలుగు వారితో పెట్టుకుంటే అడ్రస్ ఉండరు... రక్తం పొంగుతోంది.. ఊడిగం చేసేవాళ్లమా మేము.. పిచ్చోళ్ళ లా కనపడుతున్నామా,వెర్రోళ్ల లా కనబడుతున్నామా.. ఎవరి కోసం ఇస్తారు ఎవడబ్బ సొమ్మని ఇస్తారు ... కొత్త రాష్ట్రం ఇవ్వాల్సిందే... తెలంగాణ లో ఎన్ని ఉన్నాయి ఢిల్లీ లో ఎన్ని ఉన్నాయి తమిళనాడు లో ఎన్ని ఉన్నాయి కర్ణాటక లో ఎన్ని ఉన్నాయి గుజరాత్ లో ఎన్ని ఉన్నాయి ... ఎవడి కోసం ఇస్తారు ."ఇవి అన్నది చంద్రబాబు అంటే నమ్మగలరా... ఇది ఆయన ఆక్రోశం.. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు, మోడీ పై గర్జించిన తీరు ఇది... ఆ కళ్ళ లో బాధ ముఖం లో ఆవేశం.. బిగిసిన నరాలు, ఎగసిన ఉద్వేగం, కోపం తో జేవురించిన ముఖం... మాటల్లో ఆవేశం కోపం బాధ.... ప్రతి ఆంధ్రుడి ప్రతిస్పందన ఇలానే ఉంటది ...
బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ.. కేంద్రం చాలానే ఇచ్చిందని లెక్కలు చెబుతుంటే చంద్రబాబు మధ్యలో అడ్డుకున్నారు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని విష్ణుపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. కేంద్ర సంస్థలు ఎవరి కోసం ఇస్తారని.. ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉండటానికి విష్ణుకుమార్ రాజుకు అర్హత లేదన్నారు. రక్తం ఉడికిపోతుందన్నారు. ‘‘ఎవరికి ఊడిగం చేస్తారు? ఏం చేస్తారయ్యా మీరు? జైల్లో పెడతారా... ఆవేదన ఉండదా మాకు? తమిళులకి ఎన్ని ఇచ్చారు? గుజరాత్‌కి ఎన్ని ఇచ్చారు.? రోషం లేదా? తమాషాగా ఉందా.. న్యాయం జరిగేంత వరకు వదిలి పెట్టాం. వినేవాళ్లు ఉంటే చెవుల్లో పువ్వులు పెడతారండి. మహిళలు వచ్చి.. పోరాడతామంటున్నారని.. పెన్షన్ డబ్బులు విరాళంగా ఇస్తున్నారని .. ఆంధ్ర ప్రజలకు పౌరుషం లేదా అని అడుగుతున్నారని.. సాధారణ మహిళలకు ఉండే పరిజ్ఞానం మీకు లేదా’’ అని ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాపై తాను మాట మార్చలేదని.. కేంద్రమే తప్పుడు సమచారమిచ్చి.. అన్యాయం చేసిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. 14వ ఆర్థిక సంఘం పేరుతో మోసం చేశారని.. ఆ సంఘం చైర్మన్ హోదాపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్వయంగా చెప్పారన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ప్యాకేజీ పేరు చెప్పిందన్నారు. డబ్బులు ఇవ్వండని అడిగితే అప్పు ఇస్తానంటున్నారని.. అప్పు ఇస్తే.. తాను సంపాదించుకోలేనా అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. ‘‘మీరు ఇచ్చింది ఏంటి? మేము పన్నులు కట్టడం లేదా..? నాకు హక్కు లేదా? నాకు అన్యాయం జరిగినప్పుడు.. నాకు ఎందుకు ఇవ్వరు? దేశంలో భాగంగా లేమా? తమిళనాడులో, ఈశాన్య రాష్ట్రాల్లో ఎందుకు వ్యతిరేకత వస్తుందో ఆలోచించుకోవాలి. వ్యతిరేకంగా మాట్లాడితే ఫినిష్ చేయాలని చూస్తారు. ఏపీ నాలుగన్నర సంవత్సరాల పాపలాంటిది. చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇస్తే కానీ బలంగా ఎదగలేరు. అలాంటి ఏపీకి సాయంగా ఉంటారని.. ఆదుకుంటారని.. మద్దతుగా ఉన్నాను. ఎవరో ఒకరు సాయం చేస్తారనుకున్నాను. హోదా ఇవ్వకపోయినా.. ఏ పేరుతో ఇచ్చినా.. రాష్ట్రాన్ని ఆదుకుంటే సరిపోతుందనుకున్నాను. అన్నీ దిగమింగుకుని .. ఈగోని సంతృప్తి పరుస్తుంటే.. మట్టి, నీళ్లు ముఖాన కొట్టి వెళ్లారు’’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.