తిరుపతి ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు విమానాల రకాపోకలు సాగించాలాన్న కల త్వరలోనే నెరవేరే అవకాసం కనిపిస్తుంది. అంతర్జాతీయ విమానాల రాకపోకల నిమిత్తం నూతన టెర్మినల్ ప్రారంబించి, దాదాపుగా మూడున్నర సంవత్సరాలు అయ్యింది. అయితే కేంద్రం సహకారం లేకపోవటంతో, ఇప్పటికి వరకు ఒక్క విమానం కూడా ఎగరలేదు. రేణిగుంట తిరుపతి అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ని వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన గరుడ ఆకృతిలో 191 కోట్లతో అన్ని హనులతో 305 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. 2015 అక్టోబర్ 22 న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మోడీ ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి విదేశీ విమానాల రాకపోకలు మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఆసలు చిగురిస్తున్నాయి.
తిరుపతి నుంచి విజయవాడ ద్వారా కువైత్ దేశానికి విమాన సర్వీసు నడపడానికి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు ఏపీఎన్ఆర్టీ ప్రతినిధులు రాజశేఖర్, ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు నుంచి లక్షలాది మంది కువైత్ దేశానికి వెళ్లి జీవనం సాగిస్తున్నారని, వీరిని దృష్టిలో ఉంచుకొని అతి దగ్గర తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి విజయవాడ మీదుగా కువైత్‌కు విమాన సర్వీసు నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులను కోరడం జరిగిందన్నారు. తమ విన్నపాన్ని మన్నించి ప్రజల ద్వారా సర్వే చేసి వచ్చే స్పందనను బట్టి త్వరలో కువైత్‌కు ప్రత్యేక సర్వీసును నడపడానికి ఎయిర్ పోర్టు అధికారులు అంగీకరించారన్నారు.
విజయవాడ నుంచి సింగపూర్‌కు ఇటీవల ప్రారంభించిన విమాన సర్వీసుకు ప్రజల నుంచి భారీ స్పందన రావడం జరిగిందన్నారు. ప్రతి రోజూ చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి అనేక విమానాల ద్వారా కడప, నెల్లూరు, అనంతపురం ప్రాంతాలకు సంబంధించిన గల్ఫ్ దేశాల్లోని ప్రధానంగా కువైత్ దేశం నుంచి వేలాది మంది ప్రతి రోజూ ప్రయాణాలు చేస్తున్నారన్నారు. వీరికి తిరుపతి నుంచి విమానం నడిపితే ఎంతో సౌకర్యంగా ఉంటుందని తాము తెలియజేశామన్నారు. తమ విన్నపాన్ని స్వీకరించి ప్రజలతో సర్వే నిర్వహించి ఆ స్పందనను బట్టి త్వరితగతిన తిరుపతి నుంచి విమాన సర్వీసు నడపడానికి ఏపీ ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులు అంగీకరించారన్నారు. ఏపీఎన్ఆర్టీ ద్వారా నిర్వహించే సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేస్తే త్వరితగతిన ఈ సౌకర్యం ఏర్పడుతుందన్నారు.