తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయంపై టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అధికారం కోసమే దగ్గుబాటి కుటుంబం వైసీపీలో చేరిందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. దగ్గుబాటి మారని పార్టీలు లేవన్నారు. ఆర్ఎస్ఎస్ మొదలుకొని అన్ని పార్టీల చుట్టూ ప్రదక్షిణలు చేశారని విమర్శించారు. బీజేపీ.. కాంగ్రెస్.. బీజేపీ.. ఇప్పుడు వైసీపీ.. ఇలా రకరకాల పార్టీలు మారారని విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్ హయాంలో ఆమె కేంద్రమంత్రి, ఈయన ఎమ్మెల్యే… ఆ తర్వాత కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీలోకి వెళ్లారు. ఇప్పుడు వైసీపీలో చేరారు. అధికారం కోసమే వీళ్ల ఫిరాయింపులన్నీ’ అని విమర్శించారు.
ఇక.. అధికారం కోసమే లక్ష్మీపార్వతి వైసీపీతో కుమ్మక్కు అయ్యారని బాబు అన్నారు. అవకాశవాదంతోనే ఆనాడు ఎన్టీఆర్‌ను వాడుకున్నారని.. వీళ్ల అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. వాళ్లు అవకాశవాదంతో ఎన్టీఆర్‌కు అప్రతిష్ట తెస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ బయోపిక్‌తో పాటు.. మళ్లీ ఎన్టీఆర్‌పై బయోపిక్ తీయాలని కుట్రలు చేస్తున్నారని, ఈ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. దగ్గుబాటి వైకాపా అధినేత జగన్ తో భేటీ అయిన సందర్భంగా ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటూ తెలుగుదేశంపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఏకపక్షం కానుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. జయహో బీసీ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, రాజమహేంద్రవరం సభ ‘మూడ్ ఆఫ్ ది స్టేట్’ కు నిదర్శనమన్నారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీపై ఉన్న నమ్మకాన్ని బయటపెట్టిందన్నారు. బీసీ కులాల ఐక్యతను కాపాడుకోవాలన్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందన్నారు. బీసీలపై వైకాపా, తెరాస కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. తెరాస 29 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించిందన్నారు. తెరాసతో జగన్ కలయిక బీసీ వ్యతిరేకమన్నారు. ప్రజలను మభ్యపెట్టాలనేదే జగన్ అజెండా అన్నారు. వైకాపా రాష్ట్ర సమస్యలపై కేంద్రాన్ని ఒక్క మాట కూడా మాట్లాడరన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను వ్యతిరేకించే టీఆర్ఎస్ తో వైకాపా కలయికను ప్రజలు వ్యతిరేకిస్తారన్నారు. బీసీల ఐక్యతను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతోందన్నారు.